అధికారంతో విషమెక్కావ్‌.. ఆదర్శాలను తుంగలో తొక్కావ్‌‌!.. ఆప్‌ సర్కార్‌పై అన్నా హజారే ఆగ్రహం

30 Aug, 2022 15:36 IST|Sakshi

రాలేగావున్/ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ప్రముఖ గాంధేయవాది ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్‌ సర్కార్‌ విమర్శలు.. దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తన మాజీ శిష్యుడైన కేజ్రీవాల్‌పై అన్నా హజారే బహిరంగ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు.

‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి. లిక్కర్‌ పాలసీ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆప్‌ మేనిఫెస్టో స్వరాజ్‌కు పరిచయం నాతోనే రాయించావు. అందులో మద్యంవిధానాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పావ్‌. నివాస ప్రాంతాల్లో స్థానికుల మద్దతు లేకుండా లిక్కర్‌ షాపులు తెరవనని స్వరాజ్‌లో పేర్కొన్నావ్‌. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఆదర్శాలను ఎలా మరిచిపోయావ్‌?..   

నువ్వు, మనీశ్‌ సిసోడియా, అంతా కలిసి ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించారు. కానీ, ఇప్పుడు మిగతా పార్టీలకు మీకు తేడా ఏం లేకుండా పోయింది అని ఆయన లేఖలో మండిపడ్డారు. నేను సూచించినట్లుగా..  మనం ఒక గ్రూప్‌గా ఉండి.. అవగాహన డ్రైవ్ చేపట్టి ఉంటే.. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ ఏర్పడి ఉండేది కాదేమో. అయినా బలమైన లోక్‌పాల్‌, అవినీతి వ్యతిరేక చట్టాలకు బదులు.. లిక్కర్‌ పాలసీని తీసుకొచ్చే యత్నం చేశావ్‌. పైగా అది పూర్తి ప్రజా.. ప్రత్యేకించి మహిళా వ్యతిరేక నిర్ణయం అంటూ.. లేఖలో ఆగ్రహం వెల్లగక్కారు హజారే. 

మద్యంలాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది. అధికారం అనే మత్తుతో మీరు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నా.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో ప్రజలు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుండి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదు అంటూ ఆప్‌ కన్వీనర్‌పై తీవ్ర స్థాయిలో లేఖలో మండిపడ్డారు హజారే. తన స్వస్థలం రాలేగావున్‌లో, స్వరాష్ట్రం మహారాష్ట్రలో మద్యం పాలసీలు ఆదర్శవంతంగా ఉన్నాయంటూ లేఖలో కితాబిచ్చారాయన.

ఇదీ చదవండి: నాకు క్లీన్‌ చిట్‌ దొరికిందోచ్‌!

మరిన్ని వార్తలు