'ఆపరేషన్ హస్త'.. నేతల మధ్య పొలిటికల్ వార్‌..

21 Aug, 2023 15:22 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంత పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికే 'ఆపరేషన్ హస్త' పేరుతో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌లను కలుస్తున్నారు.  

యశ్వంతాపూర్‌ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు చెబుతున్నప్పటికీ.. అసలు విషయం పార్టీ మార్పేనని రాజకీయ వర్గాల సమాచారం. ఇటీవలే సీఎం సిద్ధరామయ్యను తమ రాజకీయ గురువుగా పేర్కొంటూ సోమశేఖర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.             

ఇటీవల జేడీఎస్ నాయకుడు ఆయనూర్ మంజునాథ్  కూడా డిప్యూటీ సీఎం శివకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టనున్న ఆపరేషన్ హస్త వెలుగులోకి వచ్చింది. బీజేపీ నాయకులను కాంగ్రెస్‌లోకి తీసుకురావడమే దీని ప్రధాన ధ్యేయం.

ఆపరేషన్ హస్త అనేది ఆపరేషన్ లోటస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యగా పరిగణించవచ్చు. 2019లో ఆపరేషన్ లోటస్‌లో భాగంగా 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. దీంతో అప్పట్లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. 

బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో కమల దళం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ మఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ ఎమ్మెల్యేలతో రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. తమ సభ్యులు ఎవరూ ఫిరాయింపుకు సిద్ధంగా లేరని అన్నారు. తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. 

ఈ పరిణామాల అనంతరం బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి స్పందించాడు. కాంగ్రెస్ ఆపరేషన్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ చర్యలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసని అన్నారు. దీనిపై శివకుమార్ కూడా స్పందించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులు గుర్తుకు లేవా? అని ప్రశ్నించారు. తమ పార్టీలో చేరమని ఎవరినీ పిలవట్లేదని అన్నారు. 
ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు