ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి అహ్మద్‌ పటేల్‌ కుమారుడు షాక్‌!

5 Apr, 2022 18:15 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చేదు ఫలితాల ఫలితంగా కాంగ్రెస్‌ కష్టాలు మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి నాయకత్వ లేమి, పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీల్లోనూ నిస్పృహ నెలకొంది. ఈనేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తప్పేలా లేదు. దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ తనయుడు ఫైసల్ పటేల్‌ (41) హస్తం పార్టీపై అసమ్మతి ప్రకటించారు. 

అధిష్టానం నుంచి తనకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదని... తన దారి తాను చూసుకుంటానంటూ ట్విట్టర్‌లో బాంబు పేల్చారు.  ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ట్వీట్‌తో ఫైసల్ ఆప్‌లో  చేరుతారనే ప్రచారం జోరందుకుంది. 

మరోవైపు మార్చి 27న కూడా ఫైసల్‌ అసెంబ్లీ ఎన్నికల రూట్‌ మ్యాప్‌ను ప్రకటించారు. పార్టీతో పనిలేకుండా బరూచ్‌ నుంచి నర్మదా జిల్లా వరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. 7 సీట్లలో విజయం సాధించేందుకు తన టీమ్‌ ప్రణాళికలు రచిస్తోందని అన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్‌కు ఫైసల్‌ ‘చేయి’ ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉండగా.. గత రెండేళ్లలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ప్రసాద, అశ్వని కుమార్‌, ఆర్పీఎన్‌ సింగ్‌ వంటి కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు