సుజనాకు ఝలక్‌ ఇచ్చిన ఏపీ బీజేపీ

31 Jul, 2020 12:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ/న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఏపీ బీజేపీ గట్టి ఝలక్‌ ఇచ్చింది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. రాజధాని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్న సుజనా చౌదరి వ్యాఖ్యలు పార్టీ వైఖరికి విరుద్ధమని తెలిపింది. సుజనాచౌదరి వెల్లడించిన అభిప్రాయాలకు పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. రాజధానిపై కేంద్రం సరైన సమయంలో స్పందిస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. పార్టీ అభిప్రాయాన్ని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారని ట్విటర్‌లో పేర్కొంది.(కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు)

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజు.. పార్టీ నాయకులును కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పార్టీ ఎజెండా, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. పార్టీలో భిన్న స్వరాలను గట్టిగా హ్యాండిల్‌ చేస్తామని తేల్చిచెప్పారు. బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆటలో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతంగా ముందుకు తీసుకెళతామని ప్రకటించారు.(సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తా)

>
మరిన్ని వార్తలు