డాక్టర్‌ ఓవీ రమణపై బీజేపీ సస్పెన్షన్‌ వేటు

5 Aug, 2020 17:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్‌ ఓవీ రమణపై ఆ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. రమణ తీరును రాష్ట్ర బీజేపీ యూనిట్‌ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఈమేరకు ఏపీ బీజేపీ కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఓవీ రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా, మూడు ముక్కలాటతో నష్టపోతున్న బీజేపీ అంటూ పార్టీ లైన్‌కు విరుద్ధంగా ఓవీ రమణ రెండు రోజుల క్రితం ఓ తెలుగు దినపత్రికలో వ్యాసం రాశారు.

‘మొన్నటి దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని దీక్షలు చేశారు. మీడియా సమావేశాలు పెట్టి ఒకటికి పదిసార్లు ప్రకటించారు. ఇప్పుడేమో రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని సరికొత్త ప్రవచనాలు వల్లిస్తున్నారు. దీంతో, బీజేపీపైన ప్రజల్లో ఉన్న నమ్మకం ఒక్కసారిగా క్రిందికి జారిపోయింది. నిన్న ఏపీ బీజేపీ నూతన అధ్య క్షుడు ఢిల్లీలో మాట్లాడుతూ, ‘అమరావతి రైతులకు అండగా ఉంటాం, రాజధాని విషయం మాత్రం రాష్ట్రం నిర్ణయమే’ అని చెప్పడం విచిత్రంగా ఉంది. రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినపుడు ఇక మద్దతు దేనికిస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడుకున్న బీజేపీ ఔన్నత్యాన్నే శంకించే పరిస్థితి ఏర్పడింది’అని ఓ.వీ రమణ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీని సూటిగా ప్రశ్నించారు. (వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ )

మరిన్ని వార్తలు