రాధాకృష్ణ తెగ ఫీలవుతున్నారు: సోము వీర్రాజు

22 Aug, 2020 14:25 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని బహిరంగ ప్రకటన ద్వారా హితవు పలికారు. రాధాకృష్ణ ఏం చేసినా, ఎన్ని చేసినా టీడీపీ మంచికే అన్న విషయం అందరికీ తెలుసునని అన్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ఆంద్రజ్యోతిలో ప్రచురించిన "మీ జీవీఎల్, మీ ఇష్టం" విశ్లేషణపై సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
(చదవండి: రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన చంద్రబాబు)

బీజేపీ అధ్యక్షుడి పత్రికా ప్రకటన యథాతథంగా.. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి "మీ జీవీఎల్, మీ ఇష్టం" అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది.

ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా?

అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను.
(చదవండి: తప్పుడు కథనం ఆధారంగా ‘పిల్‌’ ఏమిటి?)

మరిన్ని వార్తలు