CM YS Jagan: పచ్చ ప్రకోపానికి ఇదే సరైన మందు

31 Dec, 2022 11:15 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రోజు, రోజుకు తన ప్రసంగాలలో పదును తేలుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్‌లో ఆదివారం రోజు చేసే  చేసే విమర్శలకు ఆయన వారానికి ఒక్కసారి తన కార్యక్రమంలో తిప్పికొడుతున్న తీరు ప్రభావవంతంగా ఉంటోందని చెప్పాలి. చంద్రబాబు.. రోజూ చేసే దూషణలన్నిటినీ జగన్ ఒక్క గంటలో ఘాటుగా జవాబిస్తున్నారు. అందులో చమత్కారం, ఎద్దేవ కలగలిసి ఉండి సభికులను ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి.

కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు తన పద్దతి మార్చుకోలేదు. సభలను ఆపకపోగా, ఇతర పట్టణాలలో కూడా అవే ఇరుకు రోడ్లలో సభలు పెడుతున్నారు. పైగా చచ్చిపోయినవారిలో బిసిలు ఎక్కువగా ఉన్నారంటూ, కనుక తన సభకు బిసిలు ఎక్కువమంది వస్తున్నారని లెక్కలేసుకునే దారుణ స్థితికి చంద్రబాబు రాజకీయం చేరింది. వచ్చినవారిలో పలువురు కూలీకి వచ్చామని ఓపెన్‌గానే చెబుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ సభకు బస్‌లలో తరలించారని, ఉపాధి హామీ కూలీలను తీసుకు వచ్చారని ప్రచారం చేసే తెలుగుదేశం పత్రిక ఈనాడు, మరి చంద్రబాబు సభకు ఎలా తీసుకు వచ్చింది ఎందుకు రాయడం లేదు? యధా ప్రకారం ఇరుకు రోడ్ల పోటోలను చూపి భారీగా తరలి వచ్చారని ఎందుకు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు సభలను గమనించినా, ఈనాడు, తదితర టిడిపి మీడియాలను గమనించినా కందుకూరులో ఎలాంటి ఘటన జరగలేదేమో, అంతా సజావుగానే ఉందేమో అన్న భ్రమ కలుగుతుంది. ఎందుకంటే టిడిపి సభలో ఎనిమిది మంది మరణించిన ఘటనను అంతా మర్చిపోవాలని వారి అభిలాష అన్నమాట.

ఈ నేపథ్యంలో జగన్ నర్సీపట్నం సభను పరిశీలించండి. సభకు వచ్చిన జనాన్ని చూడండి. సభా ప్రాంగణం చాలక బయట కూడా కిక్కిరిసిపోయిన జనం కనిపిస్తారు. అయినా ఈనాడు మాత్రం వచ్చినవారు అలా వచ్చారు? ఇలా వెళ్లారు.. పులిహోరా వదలివేశారు.. అంటూ పులిహోర వార్తలు వేస్తోంది. చంద్రబాబు సభను రోడ్డు మధ్యలో పెడితే ప్రజలకు ఎవరికి అసౌకర్యం కలగలేదన్నమాట. ట్రాఫిక్ ఎక్కడా ఆగలేదన్నమాట. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సభలకే కాదు.. అమరావతిలో పిచ్చి మొక్కలు చూపించడానికి, పోలవరంలో అసంపూర్తి కట్టడాలు చూపించడానికి, జయము జయము చంద్రన్న అని పాడించడానికి జనాన్ని తరలించినప్పుడు ఈనాడు వారి కన్నులకు పండగగాను, చెవులకు శ్రావ్యంగానూ ఉన్నాయన్నమాట. ఈ పత్రిక దిగజారుడుతనం గురించి రోజూ చెప్పుకున్నా చాలడం లేదు.

మరో వైపు జగన్ ప్రసంగానికి వస్తున్న స్పందన చూడండి. ఆయన విసిరిన వ్యంగ్యోక్తులు పేలుతున్నాయి. రాజకీయం అంటే డ్రోన్ షాట్లు, డైలాగులు చెప్పడం కాదు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం, నిరుపేదల కష్టాన్ని తీర్చి వారికి అండగా ఉండడం అని ఆయన తేల్చి చెప్పారు. కందుకూరులో చంద్రబాబు తన డ్రోన్ షాట్‌ల కోసం అంతమందిని బలితీసుకున్నారని ఆయన చెబుతూనే రాజకీయం ఎందుకోసమో వివరించారు. చంద్రబాబు సభలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని తిప్పికొట్టారు. గతంలో గోదావరి పుష్కరాలలో 29 మంది మరణించిన ఘట్టాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

అసలు చంద్రబాబు సభలకు ఎందుకు జనం వస్తారు అంటూ పలు ప్రశ్నలు సంధించారు. లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎగ్గొట్టినందుకా? డ్వాక్రా మహిళలను మోసం చేసినందుకా? బిసిలను, ఎస్సిలను అవమానించినందుకా అంటూ అంటూ జగన్ పలు ప్రశ్నలు సంధించిన తీరు సున్నితంగా కనిపించినా, చంద్రబాబు నషాళానికి అంటే ఘాటు వంటిదే అని చెప్పాలి. కాకపోతే చంద్రబాబు వీటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు కనుక ఆయనకు ఆ బాధ ఉండదు. అందుకే జగన్ విమర్శలకు ఆయన జవాబు ఇవ్వకుండా తన దూషణలను మాత్రం కొనసాగిస్తుంటారు. జగన్ చెప్పిన మాటలలో కొన్నిటికైనా చంద్రబాబు రిప్లై ఇచ్చే పరిస్థితి లేకపోవడం తెలుగుదేశం దయనీయ పరిస్థితికి దర్పణం అని చెప్పాలి. 

- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్

మరిన్ని వార్తలు