పైసా ఇవ్వని వాళ్లు.. ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్‌

27 Jun, 2022 13:13 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు.. ఇవాళ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్లు విమర్శించే మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  శ్రీకాకుళంలో సోమవారం జరిగిన మూడవ విడత అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. 

మన పిల్లలు ప్రపంచంతో పోటీపడే రోజు రావాలి. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గాలి కూడా. అలాంటి రోజు రావాలంటే క్రమం తప్పకుండా బడికి పోవాలి. బడికి వెళ్తేనే చదువు వచ్చేది. ఆ బాధ్యతను అక్కచెల్లెమ్మలే చూసుకోవాలి. నాడు-నేడులో బడుల రూపు రేఖలు మారుస్తున్నాం. పాఠశాలల మెయింటెనెన్స్‌ కోసమే అమ్మఒడిలో కాస్త కేటాయింపులు చేస్తున్నాం. స్కూళ్ల బాగోగుల కోసమే అమ్మ ఒడిలో రూ.2వేలు కేటాయించాం. కానీ, ఈ రెండు వేల రూపాయల మీద కొందరు విమర్శలు చేస్తున్నారు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

ప్రతి విద్యార్థి బతుకు మార్చాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని ఉద్ఘాటించిన సీఎం జగన్‌.. అతిపెద్ద ఎడ్యుకేషన్‌ బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ప్రతిఏటా 24వేలు ఖర్చు చేస్తే అందుబాటులోకి రాని బైజూస్‌ యాప్‌ను.. పేద పిల్లలకు ఉచితంగా ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఏనాడైనా నిజాలు చెప్పే ధైర్యం ఉందా? దుష్టచతుష్టయాన్ని సీఎం జగన్‌ నిలదీశారు. ఐదేళ్ల బాబు పాలనలో ఇలాంటి ఆలోచన కూడా చేయలేదని గుర్తు చేశారు సీఎం జగన్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయాలకు 8నెలల జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. చంద్రబాబు పాలనలో పోషణం పథకానికి ఐదు వందల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అలాంటిది మన ప్రభుత్వం  వైఎస్సార్‌ పోషణం కింద రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది.  ఇప్పుడు కుయుక్తులు, కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతోంది. మారీచులతో మనం యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేదరని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

ఇంకా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

► మూడేళ్లలో అమ్మఒడి కింద రూ.19,617 కోట్లు ఖర్చు చేశాం. 

► విద్యాదీవెన కింద దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. 

► జగనన్న వసతి దీవెన కింద రూ. 3,329 కోట్లు ఖర్చు చేశాం.

► విద్యాదీవెన, వసతి దీవెన.. ఈ రెండింటి మీదే మూడేళ్లలో రూ.11 వేల కోట్లు ఖర్చు. 

► జగనన్న గోరుముద్ద కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేశాం. 

► విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌ కోసం రూ.52,600 కోట్లు ఖర్చు చేశాం. ప్రతీ విద్యార్థి బతుకు బాగుపడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ ఆశయ సాధన దిశగా కృషి చేస్తానని పేర్కొంటూ అమ్మ ఒడి మూడో విడుత నిధులను రిలీజ్‌ చేశారు సీఎం జగన్‌.

చదవండి: అందుకే 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు