సుబ్బయ్య హత్యపై టీడీపీ దిగజారుడు రాజకీయం

3 Jan, 2021 13:19 IST|Sakshi

సాక్షి, కడప : ప్రొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్య హత్య విషయంలో ఆ పార్టీ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకమైన, జనరంజకమైన పాలన అందిస్తుంటే ఓర్వలేక టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. హత్యకు గురైన సుబ్బయ్యకు నేరచరిత్ర టీడీపీ హయాంలోనే ఉందని,14 కేసులు నమోదయ్యాయని అన్నారు. హత్యను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి పైకి నెట్టేందుకు టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని , రాచమల్లు దేవునిపై ప్రమాణం చేసి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారని అంజాద్ బాష తెలిపారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి వైఎస్సార్ జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, రఘురామి రెడ్డి.. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి కలిశారు. ఇటీవల ప్రొద్దుటూరు లో టీడీపీ నేత హత్య నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ప్రతిపక్ష టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లుకు మద్దతు తెలిపారు. జరిగిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు నాపై ఆరోపణలు చేస్తున్నాయని వివరించారు. భూముల కొనుగోళ్లు, ఇతర వ్యవహారాల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. నాకున్న ఆస్తులు, ఇల్లు, భూములు అన్నీ తన అన్న సంపాదనే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉందని నేను ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని అన్నారు.

మరిన్ని వార్తలు