స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్‌

7 Mar, 2023 17:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స్మార్ట్‌ మీటర్లపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించొద్దని ఏపీ ఎనర్జీ స్పెషల్‌ సీఎస్‌ విజయానంద్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌ విజయవంతమైందన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘వ్యవసాయంలో విద్యుత్ వినియోగం స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుస్తుంది. స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ మీటర్లని ఏర్పాటు చేస్తున్నాం. మంచి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం టెక్నాలజీని ఇపుడు ఎలా వాడతాం’’అని విజయానంద్‌ ప్రశ్నించారు.

వాస్తవిక దృక్పథంతో పరిశీలించిన తర్వాతే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ రంగంతో‌ పాటు గృహావసరాలకి, పరిశ్రమలకి కూడా స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలకి అనుగుణంగా 2025 లోపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ వినియోగంపై స్మార్ట్ మీటర్ల ద్వారా దాదాపు కచ్చిత సమాచారం‌ లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులపై భారం‌ ఉండదు’ అని విజయానంద్‌ స్పష్టం చేశారు.

‘‘రైతు అకౌంట్లలోనే వారి సబ్సిడీ నేరుగా వేస్తాం. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో 11.95 లక్షల మంది రైతులు సార్ట్ మీటర్లకి అంగీకరించారు. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో దాదాపు 99 శాతం స్మార్ట్ మీటర్లకి మద్దతు తెలిపారు. ఫిబ్రవరి నాటికి శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ లో 83.16 శాతం స్మార్ట్ మీటర్లు పనిచేస్తున్నాయి. దాదాపు 50 శాతం‌ మీటర్లు పనిచేయడం లేదనేది వాస్తవం‌ కాదు’’ అని అన్నారు.
చదవండి: మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్‌ ఇదే..

‘‘స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ చాలా పారదర్శకంగా చేస్తున్నాం. తప్పుడు వార్తలు పదే పదే రాస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటాం. స్మార్ట్ మీటర్ల టెండర్లపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ప్రయాస్ రిపోర్ట్ వృధా.. తప్పు అని అనలేదు. సగటు విద్యుత్ ధర, కొనుగోలు ధరలని లెక్క వేయడంలో‌ పొరపాట్లు వచ్చాయి. యూనిట్ రేట్‌లో వ్యత్యాసం వేయడం వలనే వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 25 వేల నుంచి 30 వేల మీటర్లని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని పరిశీలన చేశాం. ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మిగిలి జిల్లాలలో మళ్లీ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు?. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలియాల్సిన అవసరం ఉంది’’ అని విజయానంద్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు