Minister Perni Nani: పవన్‌కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ: పేర్ని నాని

11 Jul, 2022 13:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జోరువానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాదని.. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.
చదవండి: ‘విమర్శలు చేస్తారు.. చర్చకు రమ్మంటే పారిపోతారు..’

విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విశ్వసనీయత, విలువలకు నిలువుటద్దంలా సీఎం జగన్‌ పాలన ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘పక్షానికో సారి సెలవు రోజున పవన్‌కల్యాణ్‌ ప్రజాసేవ.. పవన్‌.. షూటింగ్‌లకే కాదు.. రాజకీయాల్లోనూ ఆలస్యమే. పవన్‌ అసెంబ్లీ గేటు ముట్టుకోవటమనేది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని పేర్ని నాని అన్నారు. 2024లో జగన్‌ను అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.

మీరు అందుకే గమ్మునున్నారు
శాశ్వత అధ్యక్షడు అనే పద్ధతి భారత దేశంలో ఎక్కడా లేదా?, ఇలాంటి తీర్మానం టీడీపీ లో పెడితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోరు కాబట్టి గమ్మునున్నారు. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న నీకు సాధ్యం కాదు కాబట్టి ఏదో అంటున్నారు. మా పార్టీ మా ఇష్టం...మీకెంటి అభ్యంతరం. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని స్వయంగా ఫోన్ చేసి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముని బలపరచాలని కోరారు. అమిత్ షా కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేసి మద్దతు కోరారు. ప్రధాని కార్యాలయం నుంచి మద్దతుగా సంతకం చేయాలి రమ్మని సీఎం వైఎస్ జగన్‌ రమ్మని కోరారు. మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి సంతకాలు చేసి మద్దతు పలికారు. మేము అంటరానివాళ్ళమైతే రేపు ముర్మూ గారు ఎందుకు వస్తున్నారు. ఆ మాటలు మాట్లాడిన సత్యకుమార్ కి నిజంగా సత్తా ఉంటే రేపు ఆమెను రాకుండా చేయండి. స్థాయి,శక్తికి మించి మాట్లాడితే భంగ పాటు తప్ప ఏమీ ఉండదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు