చంద్రబాబు తెలంగాణ సలహాదారా? 

31 Jul, 2021 08:05 IST|Sakshi

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపైపెదవి విప్పడేం 

టీఆర్‌ఎస్‌ లేఖలన్నీ టీడీపీ రాసినట్లే ఉన్నాయి 

రాయలసీమంటే ఎందుకు ద్వేషం 

లిఫ్ట్‌పై టీడీపీ వైఖరేంటి? 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: తెలంగాణ సాగునీటి పారుదల విభాగానికి విపక్షనేత చంద్రబాబు సలహాదారుగా మారడం వల్లే ఆంధ్రప్రదేశ్‌ నీటి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ అంటే ఆయనకు నిలువెల్లా ద్వేషమెందుకని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు చేపడితే చంద్రబాబు అడ్డుకున్నాడని, వైఎస్‌ జగన్‌ ఎత్తిపోతల చేపడుతుంటే ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్‌పై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘నీళ్ల రాజకీయాలు చేస్తూ, రాయలసీమకు ప్రాజెక్టులే ఉండకూడదనే వ్యక్తి చంద్రబాబు. వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రాజెక్టులన్నీ కళకళలాడి, రైతులు ఆనందంగా ఉంటే తెలుగుదేశం నేత ఓర్వలేకపోతున్నాడు. చంద్రబాబు ఏపీలో ప్రతిపక్ష పాత్రను మర్చిపోయి, తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ లేఖలన్నీ టీడీపీ రాసిచ్చినట్టే ఉన్నాయి. కృష్ణానదీ జలాల వివాదాల బోర్డు పంపకాల ప్రకారం ఏపీ నీటిని వాడుకుంటోంది. కె.సి.కెనాల్, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ), గాలేరు– నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) రాయలసీమతో పాటు చెన్నైకు తాగునీరు అందించేవే.

శ్రీశైలం రిజర్వాయర్‌ నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు పూర్తిసామర్థ్యంతో పనిచేస్తుంది. 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం 7 వేల క్యూసెక్కులకు పడిపోతుంది.  దీనివల్ల కేడబ్ల్యూడీటీ–1 ద్వారా చట్టబద్ధంగా రాష్ట్రానికి వచ్చిన వాటా నీటిని కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొంది.  

కేటాయించిన నీటినే వాడుతున్నాం 
తెలంగాణ నీటి వాటాను కాకుండా, ఏపీకి కేటాయించిన నీటినే వాడుకుంటామని స్పష్టంగా చెప్పాం. తెలంగాణ మాత్రం జూరాల ప్రాజెక్టుకు ఎగువన బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా, శ్రీశైలానికి వచ్చేముందు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 800 అడుగుల స్థాయి నుంచే నీటిని తరలిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 854 అడుగులపైనే నీటిని తీసుకోమంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెప్పడం న్యాయమేనా? కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపుల ప్రకారం మా వాటా నీటిని తీసుకోవడానికే రాయలసీమ లిఫ్ట్‌ను చేపట్టాం. విభజన చట్టంలోనూ ఇది ఉంది. తీవ్ర కరువు ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం శ్రీశైలంలో 800 అడుగుల స్థాయి నుంచి కేటాయించిన జలాలను తరలించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు మాత్రమే ఇది. పోతిరెడ్డిపాడు నుంచి 854 అడుగులకు దిగువ నుంచి నీటిని తరలించే వీల్లేదు.  

పోలవరం పేరుతో చంద్రబాబు దోపిడీ 
చంద్రబాబు తన హయాంలో పోలవరం ఊసే ఎత్తలేదు. దాన్ని అవినీతి ఖజానాగా మార్చాడు. వైఎస్‌ జగన్‌ ఈ ప్రాజెక్టును పూర్తిచేసే చిత్తశుద్ధితో ఉన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. ఇలాంటి వ్యక్తి మా ప్రభుత్వంపై బురద జల్లడం విడ్డూరంగా ఉంది. నీళ్లు సముద్రంలో కలిసినా ఫరవాలేదు కానీ..  మిగులు జలాలు రాయలసీమకు వెళ్లకూడదనేలా ఆలోచనతో చంద్రబాబు ఉన్నాడు. అందుకే  తెలంగాణ ప్రభుత్వం నుంచి బోర్డుకు లేఖలు వెళుతున్నాయి. మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా, రైతు, రాష్ట్ర  ప్రయోజనాల కోసమే నిరంతరం పనిచేస్తోంది..’అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు