అమరావతిపై బట్టబయలైన టీడీపీ డ్రామా

4 Dec, 2020 16:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాసనమండలి చివరి రోజు సభ ప్రారంభంకాగానే అమరావతిపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలుగుదేశం సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్షనేత యనమల స్వయంగా రంగంలోకి దిగి అమరావతిపై చర్చకి పట్టుబట్టారు. ఏడాదిగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని.. చాలా ముఖ్యమైన అంశమని.. చర్చ జరగాలంటూ యనమల, లోకేష్ తదితరులు గట్టిగా కోరారు. బీఏసీలో లేని అమరావతిపై చర్చకి నిబంధనలకి విరుద్దంగా ఎలా అనుమతిస్తారని అధికారపక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు వ్యతిరేకించారు. పోలవరం, టిడ్కో, నాడు-నేడు లాంటి కీలక అంశాలపై చర్చ ఉందని గుర్తు చేశారు. అలా అనుమతించే పక్షమైతే రాష్ట్రంలో రోడ్ల పరిస్ధితులపై కూడా చర్చించాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చైర్మన్‌ని కోరారు. అమరావతి రైతులు ఏడాదిగా ఆందోళన చేశారని. చర్చించాల్సిన ముఖ్యమైన అంశమంటున్న టీడీపీ ఎందుకు బీఏసీలో చేర్చలేదని మంత్రి‌ బొత్స సత్యనారాయణ నిలదీశారు. తమ ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చించడానికి సిద్దమని...కానీ కొత్త సంప్రదాయాలకి చైర్మన్ తెరలేపడం మంచిది కాదని...అన్ని పార్టీల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోవాలని బొత్స కోరారు. 

అమరావతిపై చర్చకి తాము సిద్దంగా ఉన్నామని.. అందరికి న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామని.. అమరావతిపై చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయని బొత్స అన్నారు. చివరికి టీడీపీ సభ్యుల ఒత్తిడితో  సంప్రదాయాలకి విరుద్దంగా చైర్మన్ అమరావతిపై చర్చకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 311 క్రింద నోటీస్ ఇచ్చిన ఉపాధి హామీ బిల్లులపై అరగంట చర్చ మొదట ప్రారంభిస్తామని...తర్వాత సభలో బిల్లులు ప్రవేశపెట్టడం జరుగుతుందని...ఆతర్వాత అమరావతి పై గంట సేపు చర్చ ఉంటుందని.. దాని తర్వాత పోలవరం, టిడ్కో, నాడు-నేడుపై చర్చ ఉంటుందని చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. అనంతరం సభ ప్రారంభమై ఉపాధి హామీ బిల్లులపై చర్చసాగింది. దీనికి పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సమాధానం చెప్పి సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ సరికొత్త డ్రామా ప్రారంభించింది. అమరావతిపై చర్చకి నోటీస్ లిచ్చిన టీడీపీనే ఉపాధి హామీ బిల్లులు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ ఆందోళనకి దిగి వెల్, పోడియంవద్దకి దూసుకెళ్లారు. దీంతో సభని చైర్మన్ రెండుసార్లు వాయిదా వేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన నడుమ బిల్లులని ఆమోదించారు.  (చదవండి: చంద్రబాబుకు చేదు అనుభవం)

ఉపాధి హామీ బిల్లులపై చర్చ ముగిసినా టీడీపీ ఎమ్మెల్సీలు సభ జరగకుండా అడ్డుపడటంతో చైర్మన్ శాసనమండలిని‌ నిరవదిక వాయిదా వేశారు. అమరావతిపై చర్చకి‌ మీరే పట్టబట్టి ఇపుడు ఆ చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారన్న మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్సీలని నిలదీసినప్పడికీ వారు పట్టించుకోలేదు. అమరావతిపై చర్చ జరిగితే గత అయిదేళ్ల టీడీపీ దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే ఉపాదిహామీ బిల్లుల‌పై నిరసన పేరుతో శాసనమండలిలో తెలుగుదేశం కొత్త డ్రామాకి తెరలేపినట్లు తెలుస్తోంది అన్నారు. టీడీపీ నిరసన జరగకుండా సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించి ఉంటే అమరావతి పై చర్చ జరగడంతో పాటు కీలకమైన పోలవరం, టిడ్కో, నాడునేడుపై చర్చ జరిగేదన్నారు. కానీ తెలుగుదేశం నేతల నిర్వాకం వల్ల ఇవేమీ చర్చకి రాకుండా శాసనమండలి నిరవదిక వాయిదా వెనుక టీడీపీ డబుల్ డ్రామానని స్పష్టమైంది. అమరావతిపై టీడీపీ బయటొక రకంగా...శాసన మండలిలో మరో రకంగా ప్రవర్తించడంతో.. డ్రామా తేలిపోయింది.

మరిన్ని వార్తలు