Vizianagaram: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ విజయబావుటా

19 Sep, 2021 12:50 IST|Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాలో ఫ్యాన్‌గాలి బలంగా వీచింది. ప్రభంజనం సృష్టించింది. ప్రజాసంక్షేమ పాలనకు ఓటర్లు పట్టం కట్టారు. స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు. టీడీపీని మరోసారి గట్టిగా తిరస్కరించారు. ఓటరు తీర్పుతో స్థానిక సంస్థల చరిత్రలో తిరుగులేని ఆధిక్యం సాధించి ఫ్యాన్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత సాధారణ ఎన్నికల్లోనూ, మున్సిపోల్స్‌లోనూ చావుదెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల్లోనూ చతికిలపడింది.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై టీడీపీ సహా విపక్ష పార్టీలు ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. జిల్లా పరిషత్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని అద్భుతం నెలకొంది. మొత్తం 34 జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక 33 మండల అధ్యక్ష పదవులను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అధిరోహించనున్నారు.

ఒక్క రామభద్రపురంలో మినహా టీడీపీ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు మండలాల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. కేవలం 86 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఏకగ్రీవాల సహా 444 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. బీజేపీకి మాత్రం ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానం దక్కింది. మిగతా విపక్ష పార్టీల జాడ కూడా కనిపించలేదు. 11 ఎంపీటీసీ స్థానాలు స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి.  

విజయనగరంలో వైఎస్సార్‌ సీపీ హవా...  
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఖిల్లాగా మారింది. గత సాధారణ ఎన్నికలలో విజయనగరం ఎంపీ సహా జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ ఫ్యాన్‌ హోరెత్తిన సంగతి తెలిసిందే. తర్వాత జరిగిన విజయనగరం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికలలోనూ వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలోనూ తిరుగులేని విజయం సాధించారు. పరిషత్‌ ఎన్నికలకు ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ వచ్చింది. పోలింగ్‌కు ముందే మూడు జెడ్‌పీటీసీ స్థానాలు, 55 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. మెరకముడిదాం నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) జెడ్పీటీసీగా ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.

ఇక హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఆదివారం జిల్లాలో పరిషత్తు ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లతో ప్రారంభించిన అధికారులు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్‌ పూర్తి చేశారు. సాయంత్రం ఏడు గంటలకల్లా జెడ్పీటీసీ ఫలితాల వెల్లడి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు లేకుండా కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగించడంలో జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, ఎస్పీ ఎం.దీపిక సఫలమయ్యారు. జాయింట్‌ కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేశ్‌కుమార్, వెంకటరావు, అశోక్, సబ్‌కలెక్టరు భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాథ్‌తో ప్రత్యేకాధికారులు ప్రత్యేకంగా కృషి చేశారు.  

జిల్లా పరిషత్‌లో వైఎస్సార్‌సీపీ పాగా... 
వైఎస్సార్‌సీపీ తొలిసారిగా జిల్లా పరిషత్‌ పీఠాన్ని దక్కించుకుంది. అంతేకాదు జిల్లా పరిషత్‌ చరిత్రలో క్లీన్‌స్వీప్‌ చేసిన ఏకైక పార్టీ కూడా ఇదే కావడం విశేషం. మొత్తం 34 స్థానాల్లో మూడు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 31 జెడ్‌పీటీసీ సీట్లను కూడా ప్రత్యక్ష పోరులో సొంతం చేసుకుంది. గెలుపొందినవారిలో డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు భార్య శ్రీదేవి కూడా ఉన్నారు. కొత్తవలస జెడ్పీటీసీగా ఆమె విజయం సాధించారు.  

మండలాల్లో తిరుగులేని ఆధిక్యం.... 
జిల్లాలోని 34 మండల పరిషత్‌లలో రామభద్రపురం మినహా మిగతా చోట్లా వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యం చూపించింది. బాడంగి మండల పరిషత్‌లో మాత్రమే వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు సమానంగా సీట్లు వచ్చాయి. గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదాం, గుర్ల, గరివిడి, సీతానగరం, కురుపాం మండలాల్లో టీడీపీకి ఒక్క ఎంపీటీసీ సీటు కూడా దక్కలేదు.

ఎస్‌.కోట, ఎల్‌.కోట, బొండపల్లి, గంట్యాడ, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలసలో కేవలం ఒక్కొక్క ఎంపీటీసీ సీటుకే పరిమితమైంది. అంతేకాదు ఏ ఒక్క మండలంలోనూ టీడీపీ డబుల్‌ డిజిట్‌ స్థానాలను సాధించలేకపోయింది. బీజేపీ జియ్యమ్మవలస మండలంలో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. 11 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రామభద్రపురం మండలంలోనే ముగ్గురు ఉన్నారు. అక్కడ మాత్రమే ఎంపీపీని నిర్ణయించడంలో కీలకం కానున్నారు. 
 

మరిన్ని వార్తలు