సాక్షి, అమరావతి: గడప గడపకూ కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకుంటున్నామన్నారు. మాకు ఓటు వేయని వారికీ సంక్షేమ పథకాలు అందించాం. వారికి ఏం పథకాలు అందించామో వివరిస్తున్నామన్నారు.
చదవండి: కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో
‘‘సీఎం జగన్ కంటే గొప్ప పరిపాలన చేసామని చంద్రబాబు చెప్పగలరా?. చంద్రబాబు హమీల గురించి ఎల్లో మీడియా ఏరోజూ వార్తలు ఇవ్వదు. ప్రజలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి రాయరు. పోలవరం నాశనం అయిపోవాలన్నదే ఎల్లో మీడియా కోరిక. ఏపీ శ్రీలంకలా అయిపోవాలని కోరుకుంటున్నారని’’ మంత్రి దుయ్యబట్టారు.
‘‘బినామీ పేర్లతో భూములు కొన్న అమరావతి మాత్రం వెలిగిపోవాలన్నదే వారి కోరిక. గడప గడపకూ వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఏదైనా పథకం అమలు చేస్తే కదా చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లేది. పోలవరంపై పక్క రాష్ట్రాలు మాట్లాడుతుంటే హడావుడి చేస్తున్నారని’’ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. మేనిఫెస్టోలో 95 శాతంపైగా వాగ్ధానాలను నెరవేర్చామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత జవాబుదారీతనం లేదు. నిత్యం విష ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పని అంటూ మంత్రి ధ్వజమెత్తారు.