‘రాజధాని పేరుతో సెలెక్ట్‌.. ఎలెక్ట్‌.. కలెక్ట్‌ యాత్ర’

13 Sep, 2022 17:11 IST|Sakshi

చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్‌ ఫైర్‌

సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో సెలెక్ట్‌.. ఎలెక్ట్‌.. కలెక్ట్‌ యాత్ర చేస్తున్నారని ఏపీ గృహ నిర్మాణ శాఖమంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు.. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రాంతాల మధ్య తారతమ్యాలు లేకుండా అభివృద్ధి చెందాలనేదే మా అభిమతం. అన్నీ ఆలోచించే సీఎం జగన్‌ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేశారని’’ మంత్రి దుయ్యబట్టారు.
చదవండి: అరుదైన రికార్డ్‌.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌  

‘‘మహా పాదయాత్ర కాదు.. అది టీడీపీ శవయాత్ర. ఆ పార్టీ చనిపోయినందుకు చేస్తున్న యాత్ర. టీడీపీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయి. అమరావతి పేరుని ఏటీఎంగా మార్చుకున్నారు. అమరావతి నుండి అమెరికా వరకు ఈ పేరు చెప్పుకుని వసూళ్లు చేస్తున్నారు. అప్పట్లో పోలవరాన్ని ఎలాగైతే ఏటీఎంగా మార్చుకున్నారో ఇప్పుడు అమరావతిని మార్చుకున్నారు. అమరావతికి వత్తాసు పలుకుతున్న ఈనాడు రామోజీరావు, సీపిఐ నారాయణ, రేణుకాచౌదరి, చింతమనేని ప్రభాకర్‌, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాసరావుచౌదరి, పాతూరి నాగభూషణం వీరంతా ఏ కులం?. ఈనాడులోనే వీళ్లందరి పేర్లతో వార్తలు రాసుకున్నారు?. వాళ్లంతా ఎవరు? దీన్ని బట్టి ఉద్యమం ఎవరు చేస్తున్నారో అర్థం కావటం లేదా?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు.

దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, చివరికి రైతులైనా ఈ యాత్రలో ఉన్నారా?. విజయవాడలో 40 ఆలయాలు కూల్చిన నీచుడు చంద్రబాబు. పరిపాలన చేసేవారెవరైనా ఇలా చేయగలడా?. ఎన్టీఆర్‌ని చంపి, ఇప్పుడు పూలమాలలు వేస్తున్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఊరుకోం. చంద్రబాబు పన్నిన కుట్రలో భాగమే ఈ పాదయాత్ర. అమరావతిలో మీ సామాజిక వర్గమే బతకాలా?. ఇంకెవరూ బతక కూడదా?’’ అంటూ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు