ఆ రోజు ఎన్టీఆర్ పేరు ఎందుకు గుర్తుకురాలేదు..?

22 Sep, 2022 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్‌ హయాంలో 3 మెడికల్‌ కాలేజీలు వచ్చాయన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు అండగా నిలిచిన వ్యక్తి వైఎస్సార్‌. లక్షల మంది ప్రాణాలను కాపాడిన మహానేత వైఎస్సార్‌ అని పేర్కొన్నారు.
చదవండి: ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్ 

‘‘మేము కేవలం ఎన్టీఆర్‌ పేరు మాత్రమే మార్చాం. కానీ చంద్రబాబు ఏకంగా ఆయన్ని పైకి పంపిన ఘనుడు. ఇప్పుడు ఎన్టీఆర్‌పై ప్రేమ ఒక్క చంద్రబాబుకే ఉన్నట్లు జీవించేస్తున్నాడు. ఎన్టీఆర్‌ పేరు చరిత్ర పుటల్లో చెక్కు చెదరని విధంగా ఒక జిల్లాకు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. చరిత్ర ఉన్నంత వరకు ఏపీలో ఎన్టీఆర్ జిల్లా ఉండి పోతుంది. ఆయనపై ప్రేమ, అభిమానం, గౌరవం సీఎంకి ఉంది కాబట్టే ఎవరూ అడగకుండానే ఆ పేరు పెట్టాం’’ అని మంత్రి అన్నారు.

‘‘చంద్రబాబు, లోకేష్.. చివరికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా అడగలేదు. చంద్రబాబు.. నీ 14 ఏళ్ల కాలంలో జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టలేదు..?. ఆ పేరును ఉచ్చరించే అర్హత అసలు చంద్రబాబుకి ఉందా..?. దొడ్డిదారిన మామ చాటున చేరి.. పార్టీని నిట్టనిలువునా చీల్చి లాక్కున్నాడు. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించి మానసిక క్షోభకు గురిచేశాడు. నిన్న మేము చట్టం చేసేప్పుడు నువ్వు ఎందుకు శాసనసభకు రాలేదు..?. ఆయన పేరే డాక్టర్ వైఎస్సార్‌.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అంటే అయన పెట్టిన ఆరోగ్య శ్రీ వల్లే’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘లక్షలాది మంది పేద ప్రజలకి ప్రాణ దానం చేసిన మనసున్న దైవ స్వరూపులు వైఎస్సార్‌. ఎన్టీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. మంచి మనసుతో వైద్య రంగంలో వైఎస్సార్ చేసిన సేవ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాకు నామకరణం చేస్తే కనీసం హర్షించావా...? ఆ రోజు ఎన్టీఆర్ పేరు ఎందుకు గుర్తుకురాలేదు..?. కనీసం ఆయన కుటుంబ సభ్యులు ఒక ట్వీట్ చేయలేదు’’ అని  జోగి రమేష్‌ ప్రశ్నించారు.

‘‘చంద్రబాబు నీలాంటి దిక్కుమాలిన వాళ్లు అసలు రాజకీయాల్లో ఉండొచ్చా?. ఎన్టీఆర్ ఆనాడు గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కంటే హీనం అని చంద్రబాబుని అన్నాడు. చనిపోయి ఎన్టీఆర్ ఎక్కడున్నాడో కానీ వీళ్ల నటన చూసి ఆయన ఆత్మ క్షోభిస్తుంది. చంద్రబాబు ఎన్టీఆర్ గుండెల్లో గునపం దించాడు. ఎన్టీఆర్ మంచి నటుడు ..ప్రజల గుండెల్లో ఉంటారు. లక్షలాది మందికి ప్రాణదానం చేసి దేవుడు వైఎస్సార్ కూడా ప్రజల మనసుల్లో ఉన్నారు. ఎవర్నీ కించపరచాలని, బాధపెట్టలని మా ఉద్దేశ్యం కాదు. మేము వల్ల మాలిన ప్రేమ చూపించం.. మొసలి కన్నీరు అసలే కార్చం.. వెన్నుపోటు అసలే పొడవం’’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు