AP New Cabinet Ministers: ముచ్చటగా మూడు.. చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం

11 Apr, 2022 08:32 IST|Sakshi

మంత్రి వర్గవిస్తరణలో చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం

పెద్దాయన పెద్దిరెడ్డి స్థానం పదిలం

నారాయణస్వామి విధేయతకు సుస్థిరం

ఫైర్‌బ్రాండ్‌ ఆర్‌కే రోజాకు ఛాన్స్‌ 

సీనియారీటి, విధేయత, నమ్మకానికే పెద్దపీట

ప్రధాన సామాజికవర్గాలకు చోటు

ముగ్గురికి మంత్రి పదవులతో జిల్లాకు ప్రత్యేక గౌరవం

గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం

రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ముచ్చటగా మూడు మంత్రి పదవులు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామిని కొనసాగిస్తూ బోనస్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.

చదవండి: జయ, రాజేంద్రలకు మళ్లీ మంత్రి యోగం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లాపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పార్టీ పదవులతో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రి వర్గంలో జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, దళితులకు మంత్రి పదవుల్లో పెద్దపీట వేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం హోదాను సైతం జిల్లాకే కట్టబెట్టారు.  పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరుగాంచి, రాయలసీమ జిల్లాల్లోనే పెద్దాయనగా పిలిచే సీనియర్‌ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పార్టీ కష్టకాలంలో జిల్లా అ«ధ్యక్షుడుగా అందరినీ కలుపుకుని పార్టీని నడిపించిన కళత్తూరు నారాయణస్వామికి తొలి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఏ జిల్లాకూ దక్కని అరుదైన గౌరవాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కట్టాబెట్టారు. పెద్దాయన పెద్దిరెడ్డి స్థానం పదిలం చేశారు. నారాయణస్వామి విధేయతను సుస్థిరం చేశారు.

ఇద్దరినీ తిరిగి మంత్రులుగా కొనసాగిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు జిల్లాకు బోనస్‌గా మూడో మంత్రి రూపంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. పునర్‌వ్యవస్తీకరణలోనూ మంత్రి పదవుల కేటాయింపుల్లో ప్రధాన సామాజిక వర్గాలు రెడ్డి, దళితులకు ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, రెడ్డి సామాజికి వర్గానికి చెందిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు మంత్రులుగా బెర్త్‌ ఖరారు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే మూడు మంత్రి పదవులతో అరుదైన గౌరవం కల్పించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అంబరాన్నంటిన సంబరాలు 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీనియర్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో రెండోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితోపాటు  రోజా అభిమానులు, నేతలు విజయవాడకు తరలివెళ్లారు.

రోజా వికాసం.. వెల్లువెత్తిన హర్షం 
నగరి/నిండ్ర/పుత్తూరు రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు స్థానం దక్కడంపై నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. నిండ్రలో సైతం పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పరస్పరం తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, మొదలియార్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, ఎంపీపీ భార్గవి, వైస్‌ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్పన్, నగరి కో–ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ తిరుమలరెడ్డి, పార్టీ రాష్ట్ర యవజన విభాగం ప్రదాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నిండ్ర ఎంపీపీ దీప, పార్టీ మండల కనీ్వనర్‌ వేణురాజు పాల్గొన్నారు. పుత్తూరులో నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి.

అ‘ద్వితీయ కళ’త్తూరు 
కార్వేటినగరం/వెదురుకుప్పం/పెనుమూరు : డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి రెండో పర్యాయం మంత్రి పదవి దక్కడంపై కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల కన్వీనర్‌ ధనంజయవర్మ, కో–ఆప్షన్‌ సభ్యుడు పట్నం ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బండి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, దాసరి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సుమతి,  నేతలు శేషాద్రి, సుమతి పాల్గొన్నారు. పెనుమూరులో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మహాసముద్రం సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నేతలు దూది మోహన్, బండి కమలాకరరెడ్డి, కండిగ మధు, పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కాలినడకన కొండకు..  
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడికి కేబినెట్‌లో మళ్లీ స్థానం దక్కాలని కోరుతూ కార్వేటినగరం ఎంపీపీ లతాబాలాజీ దంపతులు ఆదివారం అలిపిరి మార్గం గుండా తిరుమలకు కాలినడకన వెళ్లారు.  ఎంపీపీ లతాబాలాజీ మాట్లాడుతూ పెద్దిరెడ్డి, నారాయణస్వామికి మంత్రి పదవులు దక్కడంపై  హర్షం వ్యక్తం చేశారు.

విధేయతకు పట్టం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్యాయత చూపే అతికొద్ది మంది నాయకుల్లో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ఒకరు. నిజాయతీ, వైఎస్సార్‌ కుటుంబంపై విధేయత ఆయనకు అభరణాలు అని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. అందుకే తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవికి నారాయణస్వామిని తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉపముఖ్యమంత్రి హోదాను సైతం కల్పించారు ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఆయనకు రెండోసారి మంత్రి మండలిలోకి తీసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్‌ఆర్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి రెండోసారి మంత్రిమండలిలో చోటుదక్కడంపై హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడుగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మూడేళ్ల పాటు మంత్రిగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాయన ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. వైఎస్సార్‌ దివంగతులయ్యాక కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత ప్రప్రథమ జిల్లా అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రత్యేకించి దళిత సామాజికర్గానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మళ్లీ చోటు కల్పించారు. రెండోసారి మంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సమర్థతకు గౌరవం 
ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలోనూ చోటుదక్కింది. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు.

వైఎస్‌ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా అధికారంలో ఉన్న టీడీపీకి దీటుగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ కుప్పం మినహా క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో విడత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలోనూ చోటుదక్కించుకుని, తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత చేసుకున్నారు.

సేవకు అందలం  
రాజకీయంగా ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా వెన్నుచూపని ధీరురాలుగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉంది. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం ఆమె పారీ్టలో కీలకభూమిక పోషించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత ఆయన వెంట నడిచారు. 2014, 2019లో నగరి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, పాలకులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఆసెంబ్లీలో తన వాగ్ధాటితో అధికార పక్షానికి ఆమె ముచ్చెమటలు పట్టిస్తూ ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు.

అసెంబ్లీలో ఉంటే కష్టమని భావించిన నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఆమెను అక్రమంగా ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా నిషేధం విధించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడిచారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఆశించినా సామాజిక సమతుల్యత వల్ల చోటు దక్కలేదు. అయినా ఆమె సేవలను గుర్తించి కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలో ఆమెకు మంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చోటకల్పించారు. తొలిసారి మంత్రిగా ఆమె సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మంచి వ్యక్తికి అవకాశం 
కోవిడ్‌ సమయంలో ఎమ్మెల్యే ఆర్కేరోజా సేవలు ప్రత్యక్షంగా చూశా. అందరికీ అందుబాటులో ఉంటూ, ఎందరినో ఆదుకున్నారు. పారీ్టలను పట్టించుకోకుండా సాయం అందించారు. అలాంటి మంచి వ్యక్తికి మంత్రిగా అవకాశమివ్వడం ఆహ్వానించాల్సిన అంశం. కేబినెట్‌ ఎంపికలో ముఖ్యమంత్రి చక్కటి కసరత్తు చేశారని అర్థమవుతోంది.  
– పి. బాలసుబ్రమణ్యం, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, పుత్తూరు    

సమ న్యాయం చేశారు 
కేబినెట్‌ కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారు. ప్రధానంగా 75శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌ అభినందనీయం. కొత్త మంత్రులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నాం.
– రాజరత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు

ఎంపిక బాగుంది 
నూతన మంత్రులను పక్కాగా ఎంపిక చేశారు. సీనియర్ల అనుభవాన్ని వదులుకోకుండా అవకాశం కల్పించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా కొత్తవారిని తీసుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్‌కే రోజాకు మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉంది.
-విజయశేఖర్, చిత్తూరు 

సమర్థతకు పట్టం 
నూతన మంత్రి వర్గంలో ఎస్సీలపై ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి చాటుకున్నారు. అనుభవజు్ఞడైన నారాయణస్వామికి మళ్లీ అవకాశం కలి్పంచి సమర్థతకు పట్టం కట్టారు. ప్రజలకు సేవ చేసే నాయకులను మరువకుండా పదవులు కట్టబెట్టారు. ఇది హర్షించదగ్గ విషయం.  
– వినాయకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు    

మరిన్ని వార్తలు