చిచ్చు పెట్టండి.. రచ్చ చేయండి అంటూ

1 Feb, 2021 10:02 IST|Sakshi

టీడీపీ జిల్లా నేతలకు చంద్రబాబు ఆదేశాలు?

శనివారం అర్ధరాత్రి వరకు ఫోన్‌లో మంతనాలు

ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు కుయుక్తులు

రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పన్నాగాలు

పల్లె ప్రశాంతతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలు, రెచ్చగొట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు పథకాలు వేస్తున్నారు. నీరసపడిన తమ్ముళ్లకు నచ్చజెప్పి పోటీలో నిలబెట్టేందుకు చంద్రబాబే రంగంలోకి దిగి ఫోన్‌లో మంత్రాంగం నడిపిస్తున్నారు. గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడి అధికార పార్టీ మీద నెపం నెట్టేయాలని హుకుం జారీ చేస్తున్నారు. విజయావకాశాలు లేకపోయినా టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో రచ్చచేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధినేత ఆదేశాల మేరకు పల్లెల్లో చిచ్చుపెట్టేందుకు శ్రేణులను పురిగొల్పుతున్నారు. 

సాక్షి, తిరుపతి:‘పంచాయతీ ఎన్నికల్లో మనకు గెలిచే పరిస్థితి లేదు. ఉనికిని కాపాడుకునేందుకు ప్రయతి్నంచాలి. ఎన్నికల కమిషనర్‌ మనకు అనుకూలంగా ఉన్నారు. ఇదే అవకాశం.. గొడవలు చేయండి.. గందరగోళం సృష్టించండి. అధికారులను భయపెట్టండి. సెల్‌ఫోన్‌లో వీడియో తీయండి. ఘర్షణలకు వైఎస్సార్‌సీపీ కారణమని ప్రచారం చేయండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి వరకు పార్టీ కీలక నేతలతో బాబు చర్చలు సాగించినట్లు తెలిసింది.

జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆశాజనకంగా లేదని, నామినేషన్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని పలువురు నేతలు అధినేతకు వివరించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో తాను తలెత్తుకోలేనని, టీడీపీ తరఫున నామినేషన్‌కు ఎవరూ లేని పంచాయతీల్లో పార్టీకి సంబంధం లేని వ్యక్తులను పోటీకి దింపేందుకు యత్నించాలని ఆదేశించినట్లు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అలా చేస్తే ఎన్నిక అనివార్యమవుతుందని, అప్పుడు ఏదో ఓ సాకు చూపించి రచ్చ చేసి ప్రయోజనం పొందాలని సూచించినట్లు తెలుస్తోంది.  (చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా.. )

అసత్యాలను ప్రచారం చేయండి 
వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు ఆ పార్టీ శ్రేణులే వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కుప్పంలో టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుల సమావేశం నిర్వహించారని చెబుతున్నారు. అలాగే మాజీ మంత్రి అమరనాథరెడ్డి సైతం పలువురు నాయకులతో రహస్య సమావేశాలు నిర్వహించి కుట్రలకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

సాంకేతిక కారణాలు చూపించండి
తమకు అనుకూలంగా లేని పంచాయతీల్లో ప్రత్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి నామినేషన్లను తిరస్కరించేలా చేసేందుకు కొంతమంది న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. తామే గొడవ చేసి వైఎస్సార్‌ సీపీ నేతలపై నిందమోపేలా వీడియెలు తయారుచేసి పంపించాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆదివారం పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు తన కారుతో హల్‌చల్‌ చేశారు. జనం మీదకు దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మరిన్ని వార్తలు