పంచాయతీ ఎన్నికలు: ఏకగ్రీవాలే లక్ష్యం!

28 Jan, 2021 08:11 IST|Sakshi

గ్రామ స్వరాజ్యానికి బాటలు

కలసికట్టుగా గ్రామాభివృద్ధికి కృషి

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి నిర్దేశం

రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు

క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశాలు 

సాక్షి, అమరావతి బ్యూరో:  పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్చించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో మంగళవారం విస్తృతస్థాయిలో సమీక్షించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలని, పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన  అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. ఇన్‌చార్జి మంత్రి దిశా నిర్దేశంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు రంగంలోకి దిగారు. (చదవండి: నిమ్మగడ్డకు కంగారెందుకు? )

కసరత్తు మొదలు..  
జిల్లాలో విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 977 పంచాయతీలు ఉండగా ఇందులో 958 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌సీపీ నాయకులు పంచాయతీల వారీగా అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయాచోట్ల రిజర్వేషన్ల మేరకు పేర్లు ఎంపిక చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు నాయకులు మంగళ, బుధవారాల్లో ప్రత్యేక    సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను నమోదు చేస్తుండగా.. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురు ఆశావహులు అభ్యరి్థత్వాన్ని ఆశిస్తుండటం నాయకులకు     సమస్యగా మారింది.  

ఏకగ్రీవాలకే మొగ్గు..  
అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలను ప్రోత్సహించే దిశగా అడుగులేస్తున్నారు. తద్వారా తమ అభ్యర్థులకు విజయం చేకూర్చి పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా ఆ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాభివృద్ధిని కాంక్షించి కొంత మంది రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అన్ని వర్గాలతో చర్చించి ఏకగ్రీవానికి ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఎన్నికలు రావడంతో సర్పంచి కుర్చీని దక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తమ్మీద జిల్లాలో కీలకమైన నాయకులు తమ సొంత పంచాయతీల్లో పోటీ లేకుండా చేసుకొనే యత్నాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎన్నిచోట్ల ఎన్నికలు జరుగుతాయి? ఎన్నిచోట్ల ఏకగ్రీవమవుతాయి? అని గ్రామీణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పల్లెసీమలను అభివృద్ధిబాట  పట్టించే నాయకుడిని ఎన్నిక చేసుకునే ప్రక్రియకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అన్నదమ్ముల్లా మెలిగే పచ్చని సీమల్లో మనుషులు/మనసుల మధ్య కక్షలు, కార్పణ్యాలకు తావివ్వకుండా పంచాయతీ పదవులు ఏకగ్రీవం చేసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందంటూ పెద్దలు సూచిస్తున్నారు.

ఎలక్షన్‌ ఎక్సర్‌సైజ్‌ షురూ!
సాక్షి, అమరావతి బ్యూరో: పంచాయతీ ఎన్నికల తొలి దశ సమీపిస్తున వేళ జిల్లా అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. అందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించింది. రెండ్రోజుల క్రితం ఎన్నికల కమిషన్‌ రీషెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే మంగళవారం రిపబ్లిక్‌ డే సెలవు కావడంతో ఆ రోజు ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు వీలు పడలేదు. బుధవారం నోటిఫికేషన్‌ విడుదలతో ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. జిల్లాలో 958 గ్రామ పంచాయతీలకు, 9,652 వార్డులకు ఎన్నికలు జరగ నున్నాయి. నాలుగు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు ఈనెల 29న తొలి దశ ప్రారంభం కానుంది. 

మొదటి విడతలో...
మొదటి విడతలో విజయవాడ రెవెన్యూ డివిజన్‌కు షెడ్యూ లు ప్రకటించారు. ఆ ప్రకారం ఈ డివిజన్‌లోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట,       కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూ రు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుల పాడు, విజయవాడ రూర ల్‌ మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటికి  29 (శుక్రవారం) నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరణ చేపడతారు. జిల్లాలో 9980 పోలింగ్‌ స్టేషన్లను సన్నద్ధం చేశారు. ఇప్పటికే         పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాల ముద్రణను ఇప్పటికే పూర్తి చేయగా, బ్యాలెట్‌ బాక్సులను కూడా సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో ఉండే వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ముందుగానే వేయించేందుకు సన్నద్ధమవుతున్నారు.

అంతేకాదు..  ఉద్యోగులు, పోలీసులకు అవసరమైన వసతి సదుపాయాల కల్పనపైనా దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి గురువారం నుంచి ఫిబ్రవరి 7 వరకు దశల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు  కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులతో   ఎన్నికల విధి విధానాలను, ఎన్నికల కమిషన్‌ నిబంధనలపై తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కృషి చే యాలని ఆయన కోరారు.  
ఎన్నికల ప్రక్రియ ఇలా.. 

ఎన్నికల ప్రక్రియ                         విజయవాడ    గుడివాడ    మచిలీపట్నం    నూజివీడు  
                                               తొలి దశ         రెండో దశ     మూడో దశ       నాలుగో దశ 
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం          29.01.21    02.02.21    06.02.21    10.02.21 
నామినేషన్ల స్వీకరణ ఆఖరు             31.01.21    04.02.21    08.02.21    12.02.21 
నామినేషన్ల పరిశీలన                      01.02.21    05.02.21    09.02.21    13.02.21 
తిరస్కరణపై అప్పీలు                      02.02.21    06.02.21    10.02.21    14.02.21 
నామినేషన్ల ఉపసంహరణ                04.02.21    08.02.21    12.02.21    16.02.21 
అభ్యర్థుల తుది జాబితా                   04.02.21    08.02.21    12.02.21    16.02.21 
పోలింగ్‌ తేదీ                                  09.02.21    13.02.21    17.02.21    21.02.21 
(ఉ.6.30–సా.3.30 వరకు)     
ఓట్ల లెక్కింపు,ఫలితాల ప్రకటన          09.02.21    13.02.21    17.02.21    21.02.21 
(సా.4 నుంచి) 
ఉపసర్పంచ్‌ ఎన్నిక                        09.02.21    13.02.21    17.02.21    21.02.21 
(ఫలితాల ప్రకటన తర్వాత)
 
 

మరిన్ని వార్తలు