రూల్స్ మారాలి.. రూలింగూ మారాలి

13 Feb, 2024 11:19 IST|Sakshi

బీజేపీతో టీడీపీ పొత్తు ఫిక్స్.. షరతులు వర్తిస్తాయి 

4 : 2 : 1 ఫార్ములా @ టీడీపీ పాలిట మరణశాసనం

ఇన్నాళ్లూ ఒకలెక్క... ఇకనుంచి ఇంకోలెక్క ... వాళ్లొచ్చాక.. ప్రతి లెక్కా పక్కా.. అప్పట్లా ఇప్పుడూ నడిపిస్తాం అంటే కుదరదు... టర్మ్స్ మీరు డిసైడ్ చేసే కాలం పోయింది.. మేము రూల్స్ రాస్తాం.. మీరు పాటించాలి అనే పరిస్థితి వచ్చింది.. ఇది కాస్త చంద్రబాబు పాలిట ఆశనిపాతంలా మారింది. దీంతో ఏమి చేయాలో తెలీక చంద్రబాబు గుడ్లనీళ్ళు మింగుకుంటూ దిగులుగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అసలు కోవిడ్ అనే వైరస్ ఫార్ములాను చైనా కనిపెట్టి ప్రపంచాన్ని వణికించడంలో ఎంత నిజం ఉందో లేదో తెలీదు కానీ బీజేపీ కనిపెట్టిన ఈ కొత్త ఫార్ములా మాత్రం చంద్రబాబును వణికిస్తోంది. అద్వానీ.. వాజ్‌పేయి కాలంలో బీజేపీకి ఉన్న ఆదరణ ఓటు బ్యాంకును వాడుకుని ఒకసారి.. మోదీ క్రేజును వాడుకుని ఇంకోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తరువాత మోదీ, అమిత్ షా వంటివారిని ఎంతలా అవమానించారో టీడీపీ వాళ్ళు మర్చిపోయినా ఢిల్లీవాళ్ళు మాత్రం గుర్తుంచుకున్నారు. 

ఈసారి కూడా అలాగే బీజేపీ భుజాలమీద నుంచి అధికారం వైపు నడుచుకుంటూ పోదాం అనే చంద్రబాబు ఆశలకు ఢిల్లీ పెద్దలు అడ్డుకట్ట వేశారు. పొత్తు పెట్టుకుందాం.. మీకు అధికారం వచ్చేలా మేము సాయం చేస్తాం.. కానీ ... కానీ అంటూ షరతులు వర్తిస్తాయి అనే మాట వాడారు. ఈసారి బీజేపీ అధిష్టానం  మాత్రం షరతులు చాలా పక్కాగా రూపొందించడంతో.. ఎండు చేప ముక్క కోసం వెళ్లి బోనులో ఇరుక్కున్న మాదిరి అయింది చంద్రబాబు పరిస్థితి. 

ఇంతకూ ఏమిటా షరతులు ?
ఇన్నాళ్ల మాదిరి అక్కడా ఇక్కడా ఓ పదిహేను ఎమ్మెల్యే.. ఓ మూడు నాలుగు ఎంపీసీట్లు పడేసి రాష్ట్రం మొత్తం బిజెపికి ఉన్న ఓటు బ్యాంకుకు... ఆదరణను వాడుకోవడం ఈసారి కుదరదు. ప్రతి ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఏడు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు సీట్లు టీడీపీకి పోగా రెండు జనసేనకు, ఇంకోటి బీజేపీకి ఇవ్వాల్సిందే! లేదా రెండు బీజేపీకి.. ఒకటి జనసేనకు ఇవ్వాలి.. అంటే ఫైనల్ గా పాతిక ఎంపీ స్థానాల పరిధిలో 75 సీట్లు ఈ ఇద్దరికీ ఇవ్వాల్సిందే.

.. అలా ఇస్తే టీడీపీకి మిగిలేది వంద సీట్లే.. ఇలా ఇస్తే ఆ 75  చోట్లా టీడీపీ నాయకులను నచ్చజెప్పడం అసాధ్యం. నియోజకవర్గాల్లో నాయకులూ కొట్టుకుని చస్తారు. పార్టీ అల్లకల్లోలం అవుతుంది. పోనీ అలా కాదని.. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళితే మొన్న 2019 లో ఏమి జరిగిందో బాబుకు తెలుసు.. ఒంటరిగా జగన్ను అడ్డుకోవడం బాబుకు కలలో కూడా సాధ్యం కాదు. పోల్ మేనేజ్‌మెం‍ట్‌.. ఇతరత్రా వ్యవహారాల్లో చాలా పడగబ్బందీగా ఉండే సీఎం వైఎస్‌ జగన్ను ఎన్నికల్లో నిలువరించడం బాబుకు కుదరని పని. అలాగని బీజేపీ చెప్పినట్లు వింటే పార్టీలో తుపాను వస్తుంది.

 దీంతో ఏమి చేయాలో అర్థం కాక ఇటు అభ్యర్థులను ఖరారు చేయలేక సైలెంట్ అయ్యారు.. ఇటు వైయస్ జగన్ మాత్రం తమ అభ్యర్థులను ఒక్కొక్కరినీ ప్రకటించుకుంటూ .. సామాజిక సమీకరణాలు.. ఇతరత్రా వ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతుంటే.. టీడీపీ జనసేన కూటమి మాత్రం జాతరలో తప్పిపోయిన పిల్లల్లా బిత్తర చూపులు చూస్తూ తమను ఎవరైనా సేఫ్ ప్రాంతానికి తీసుకుపోలేకపోతారా? అనే ఆశతో అక్కడే ఉండిపోయారు.   

✍️సిమ్మాదిరప్పన్న

whatsapp channel

మరిన్ని వార్తలు