నాలుగు రోజుల్లో నన్ను అరెస్టు చేయాలి.. లేదంటే క్షమాపణలు చెప్పాలి..

15 Sep, 2022 18:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ పార్టీ విడుదల చేసిన స్టింగ్‌ వీడియోపై మండిపడ్డారు. ఒకవేళ ఆ వీడియో నిజమైతే నాలుగు రోజుల్లో తనను అరెస్టు చేయాలని కమలం పార్టీ నేతలకు సిసోడియా సవాల్ విసిరారు. 

బీజేపీ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేద్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి  ఓ స్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకడైన అమిత్ ఆరోరా.. కొంతమందికి ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించిందని మాట్లాడినట్లు ఉంది. అంతేకాదు లిక్కర్ పాలసీతో వచ్చిన డబ్బును గోవా, పంజాబ్‌లో ఆప్‌ ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు.  దీన్నే ఆధారంగా చూపుతు బీజేపీ ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. 

అయితే సిసోడియా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. సీబీఐ అధికారులు తన ఇల్లు, బ్యాంకు లాకర్‌లో సోదాలు చేసినా ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఒకవేళ ఆ వీడియో నిజమైతే తనను అరెస్టు చేసినా సిద్ధమన్నారు. లేకపోతే ఆ వీడియో ఫేక్ అని బీజేపీ నేతలు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఇది అమలులో లేదు. ఈ పాలసీలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ, అలాంటిదేమీ లేదని ఆప్ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయు. ఈ వ్యవహారంపై సీబీఐ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది.
చదవండి: గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు

మరిన్ని వార్తలు