‘స్కిల్‌’ గోల్‌మాల్‌ మీ ప్రభుత్వ హయాంలోదే.. కేశవ్‌ వినబడుతోందా?

11 Mar, 2023 10:26 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను పసికట్టడానికిగాని, వాటిపై కేసులు పెట్టడానికి గాని చాలా కష్టపడవలసి వస్తోంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం లోని కొందరు ఆ స్కామ్ లను చేయడం లో అంత స్కిల్  ప్రదర్శించినట్లుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందినవారిపై ఏదైనా ఆరోపణ వస్తే భూతద్దంలో చూపించే టీడీపీ మద్దతు మీడియా ఈ స్కామ్‌ల విషయంలో  నోరు ఎత్తడం లేదు. ఎలాంటి సొంత పరిశోధనలు చేయడం లేదు.

పైగా స్కామ్ ఆరోపణల ఉన్నవారికి మద్దతుగా ప్రముఖంగా వార్తలు ఇస్తున్నాయి. దీనిని అంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ సంగతి పక్కనపెడితే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ స్కామ్ పై ఇచ్చిన వివరణలో కొన్ని ఆసక్తికర పాయింట్లు ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకు సీఐడీ ఎలాంటి జవాబు ఇస్తుందన్నది చూడాల్సి ఉంది. అదే టైమ్‌లో సీఐడీ తన పరిశోధనలో కనిపెట్టిన వాటిపైన, అసలు తొలుత ఈ స్కామ్‌ను గుర్తించిన జీఎస్టీ అధికారుల సందేహాలపైన కేశవ్ సమాధానాలు చెప్పి ఉంటే టీడీపీకి ఈ కేసుతో అంత సంబందం లేదేమోలే అనుకునే పరిస్థితి ఏర్పడేది. కాని కేశవ్ వాటి జోలికి వెళ్లకుండా , ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు చేశారు. 

అదే టైమ్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు  ప్రస్తావించి ఆయన జోలికి సీఐడీ ఎందుకు వెళ్లడం లేదని అడుగుతున్నారు. మళ్లీ ఆ వెంటనే కేశవే ఆ అధికారి చేసిన తప్పేమీ లేదని సర్టిపై చేస్తున్నారు.ఈ స్కామ్ లో ఒకరిద్దరు కేశవ్‌కు బాగా తెలిసినవారు ఉంటే ఉండవచ్చు.  ఆయన వారి పాత్ర గురించి ప్రస్తావించినట్లు కదనాలలో రాలేదు. దానికి కారణం తెలియదు. నైపుణ్యాభివృద్ది సంస్థ ( స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) నిధులు సుమారు 335 కోట్లు పక్కదారి పట్టాయన్నది ప్రధాన ఆరోపణగా ఉంది.  స్కిల్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్న సీమెన్స్ సంస్థ 3300 కోట్ల వ్యయం చేయాల్సిఉన్నా, ఆ కంపెనీ నిదులు విడుదల చేయడానికి ముందే  మొత్తం 370 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలోని మతలబుపై సీఐడీ విచారణ జరుపుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 370 కోట్ల రూపాయలు. అయితే దానిని అమాంతంగా 3300కి ఎలా మార్చేశారన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఈ స్కామ్ లో  సీమెన్ కంపెనీ వారు తమకు తెలియకుండానే షెల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వ నిధులు తరలివెళ్లాయని కనిపెట్టారని సమాచారం వచ్చింది. 

జీఎస్టీ అదికారులు తమ విధులలో భాగంగా పరిశీలిస్తున్నప్పుడు ఈ షెల్ కంపెనీల విషయం బయటపడిందని అదికారవర్గాలు చెబుతున్నాయి. ఈ షెల్ సంస్థల ద్వారానే నిధులను సింగపూర్‌కు మళ్లించారన్న ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణలపై కేశవ్ ఒక్క మాట కూడా చెప్పలేదు. టీడీపీకి ఏమి సంబంధం అంటున్నారే కాని, ప్రభుత్వంలో జరిగిన గోల్ మాల్ పై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. జీఎస్టీ వారు ఈ కేసును వెలుగులోకి తీసింది వాస్తవమా?కాదా? సీమెన్స్ కంపెనీ ఈ లావాదేవీలను డిజ్ ఓన్ చేసుకున్నది  నిజమా?అబద్దమా? ఇప్పటికే పలువురు ఈ కేసులో  అరెస్టు అయ్యారు. అయితే కేశవ్ అడిగిన ప్రశ్న ఒకదానికి సీఐడీ సమాధానం చెప్పగలగాలి.

స్కిల్‌గా కాజేశారంటున్న  ఈ డబ్బు టీడీపీ పెద్దల ఖాతాలలోకి ఎలా వెళ్లిందన్నది తెలియచేయవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. ఇంత కుంభకోణం జరిగితే మరో అధికారి అర్జా శ్రీకాంత్ అసలేమీ జరగలేదని నివేదిక ఇవ్వడంలోని ఆంతర్యాన్ని సీఐడీ ప్రశ్నించిన మాట నిజమే. దానికి ఆయన ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది కదా! అందులో తప్పేముంటుంది. దానిపై కేశవ్ చేసిన ఆరోపణ అంత సమంజసంగా లేదని చెప్పాలి. బలవంతంగా శ్రీకాంత్‌తో మాట్లాడిస్తారని ఆయన అనుమానిస్తున్నారు. 

ఈ మాత్రానికే శ్రీకాంత్ సీఐడీ చెప్పే దానితో ఏకీభవిస్తారా? తదుపరి కోర్టులో భిన్నంగా మాట్లాడరా? శ్రీకాంత్ టీడీపీ అదినేత చంద్రబాబు ప్రభావానికి గురై తప్పుడు నివేదిక ఇచ్చారని ఎందుకు అనుకోరాదో కేశవ్ చెప్పాలి. మరో సంగతి చెప్పాలి. తాను బీజేపీ అద్యక్షుడుగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిత్యం అవినీతి ఆరో్పణలు చేస్తూ వంద రోజులుపైగా ప్రశ్నల పరంపర కొనసాగించారు. అలాంటి ఆయన ఇప్పుడు చంద్రబాబుకు పక్కన నిలబడి టీడీపీలో చేరారు.

ఆయనతోనే అర్జా శ్రీకాంత్ కు అనుకూలంగా మాట్లాడించడంలో వ్యూహం అర్దం చేసుకోలేనిది కాదు కదా! గుజరాత్‌తో సహా ఆరు రాష్ట్రాలలో సీమెన్స్ ఒప్పందం చేసుకుంటే,ఆ రాష్ట్రాలలో ఎందుకు ఆరోపణలు రాలేదు? ఇక్కడే ఎందుకు వచ్చాయి?అన్నదానిని కేశవ్ ఆలోచించకుండా ఉంటారా? నిజంగానే వైసీపీ ప్రభుత్వం కావాలని కేసులు పెడుతోందన్నది రొటీన్ డైలాగ్ తప్ప మరొకటి కాదు. టీడీపీవారికి ఆయా వ్యవస్థలలో ఉన్న పట్టు ద్వారా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలుగుతారేమో అన్న డౌట్ కూడా లేకపోలేదు.  సీఐడీ ఇంత పక్కాగా బోలెడంత వర్క్ చేసి ఆధారాలు బయటపెట్టే యత్నం చేస్తోంది. అయినా కేసు నిలబడకపోతే అది వ్యవస్థలోని తప్పు అవుతుందా? లేక నిజంగానే సీఐడీ దర్యాప్తు లోపమా? అన్నది ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పటికైతే స్కిల్ స్కామ్ కేసు చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కేసు టీడీపీలోని  అత్యంత పెద్దలకు తాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.  ఏది ఏమైనా స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ కొందరి స్కామ్ కు బలికావడం బాధాకరమే. 


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు