'ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలు'

28 Feb, 2021 16:47 IST|Sakshi

లక్నో: కొత్తసాగు చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలుగా మారుతున్నాయంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మీరట్‌లో నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయత్‌ సభకు హాజరైన కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాయం చేసే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. రైతుల భూమిని పెత్తందార్లకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని తెలిపారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనూ కూలీలుగా మారుతారంటూ పేర్కొన్నారు.

''కొత్త సాగుచట్టాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. గతంలో కనీస మద్దతు ధర ఉంది.. ఇప్పుడు అది కొనసాగుతుంది.. భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర ఉంటుందని'' మోదీ పార్లమెంట్‌ సాక్షిగా తెలిపారన్నారు. నూతన సాగు చట్టాల రద్దుకోసం మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల పోరాటాన్ని నీరు గార్చడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు. ఇదే అంశంలో యూపీలో అధికారంలో ఉన్న యోగి ప్రభుత్వానికి మాత్రం రైతుల అంశాలు పట్టవా అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టదు గాని కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు మద్దతిస్తున్నట్లు యోగి ప్రభుత్వం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లుగా మీ రాష్ట్రంలోని చెరకు రైతులకు  చెల్లింపు విషయంలో భరోసా ఇవ్వకపోవడంతోనే ఆయన పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. రైతులను పట్టించుకోని యోగి ప్రభుత్వానికి ఇది పెద్ద అవమానం అని ఎద్దేవా చేశారు.

 

మరిన్ని వార్తలు