రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు

23 Mar, 2022 19:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీవలే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు షాకిస్తూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఎన్నికల సమయం నుంచే బీజేపీ, ఆప్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగుతూనే ఉంది.

తాజాగా, ఢిల్లీ రాజకీయాలపై కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధ‌వారం ఢిల్లీ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసనం తీసుకుంటామని ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. అయితే, ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను(ఎంసీడీ) సకాలంలో నిర్వహించి, ఆ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ఢిల్లీలో తమ పార్టీని చూసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ భయపడుతోందని సెటైర్లు విసిరారు. మరోవైపు.. ఢిల్లీలోని ఈశాన్య, ఉత్తర, దక్షిణ మూడు కార్పొరేషన్లను విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ క్రమంలోనే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎప్పటికప్పుడు ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగానే ఎన్నికలను వాయిదా వేయడమంటే భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పన అమరవీరుల త్యాగాలను అవమానపరచడమే అంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు