ఆసక్తికరంగా కేజ్రీవాల్‌ బెంగళూరు పర్యటన

18 Apr, 2022 19:21 IST|Sakshi

ఏప్రిల్ 21న బెంగళూరుకు ఢిల్లీ సీఎం

రైతు సమ్మేళనానికి హాజరుకానున్న కేజ్రీవాల్‌

చేరికలు ఉంటాయన్న ఆప్‌ నేతలు

బెంగళూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. బెంగళూరు పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఏప్రిల్ 21న నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే రైతు సమ్మేళనానికి ఆయన హాజరుకానున్నారు. కర్ణాటక రాజ్య రైతు సంఘం అధినేత, రైతు నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ ఆహ్వానం మేరకు ఇక్కడకు వస్తున్నారు. 

ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీగా ప్రఖ్యాతిగాంచిన బెంగళూరులో తమ గళాన్ని వినిపించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు కనబడుతోంది. బెంగళూరు వేదికగా కర్ణాటక ప్రజలకు కేజ్రీవాల్‌ ‘న్యూ ఏజ్ పాలిటిక్స్’ సందేశం ఇస్తారని ఆప్‌ నేతలు చెబుతున్నారు. పార్టీలోకి చేరికలు కూడా ఉంటాయని వారు వెల్లడించారు. 

కర్ణాటక ఆప్ కన్వీనర్ పృథ్వి రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కోసం పోరాడే వారికి ఆప్ వేదిక అని, అలాంటి వారిని విధానసౌధకు ఎన్నుకోవడం వల్ల రైతాంగ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ‘ఇది చారిత్రాత్మకమైన రోజు అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని రైతులు వివిధ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీలు రైతులను మోసం చేస్తూ వచ్చాయి. కర్ణాటక రైతులు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుని సమస్యల పరిష్కారానికి ఆప్ మాత్రమే కృషి చేస్తుందని వారు భావిస్తున్నార’ని పృథ్వీ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆప్ ద్వారా సామాన్య ప్రజలు సృష్టించిన ‘విప్లవాన్ని’ కర్ణాటకలో ఎలా పునరావృతం చేయవచ్చనే దానిపై బెంగళూరులో కేజ్రీవాల్‌ ప్రసంగిస్తారని చెప్పారు. 

కేజ్రీవాల్‌ ప్రసంగాన్ని వినేందుకు యువత, ప్రగతిశీల ఆలోచనాపరులు ఎదురుచూస్తున్నారని ఇటీవల ఆప్‌లో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి భాస్కర్‌రావు తెలిపారు. డబ్బు, కండబలం, కులాలకు భిన్నమైన 'న్యూ ఏజ్‌ పాలిటిక్స్‌'కు రాష్ట్రం సిద్ధమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ నిజాయితీ, అవినీతి రహిత పరిపాలనను అందిస్తోందని.. అలాంటి ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి కూడా అవసరం అన్నారాయన. (క్లిక్‌: కాంగ్రెస్‌ చీఫ్‌కు ‘ఆప్‌’ భారీ ఆఫర్‌.. రెస్పాన్స్‌పై ఫుల్‌ టెన్షన్‌!)

మరిన్ని వార్తలు