కేజ్రీవాజ్‌ ప్రధాన మంత్రి అవుతారు.. రాఘవ్‌ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

9 Mar, 2022 19:19 IST|Sakshi

ఛండీగఢ్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కీలక చర్చ నడుస్తోంది. కాగా, యూపీ, పంజాబ్‌ ఫలితాలపై ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఆప్‌ నేత, పంజాబ్‌ ఎన్నికల సహ ఇన్‌ఛార్జ్ రాఘవ్‌ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. దేశ ప్రజల ఆశాకిరణమని, దేవుడి దయ, ప్రజలు అవకాశం ఇస్తే కాబోయే ప్రధాన మంత్రి ఆయనే అంటూ కామెంట్స్‌ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ జాతీయ రాజకీయాల్లో కీ రోల్‌ పోషిస్తూ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. అయితే, గురువారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాఘవ్‌ చద్దా కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో తమ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్య​క్తం చేశారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్‌ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీని అని తెలిపారు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్‌.. ప్రధాన మంత్రి స్థాయిలో హోదాలో కనిపిస్తారంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై సంచలన వ్యాఖ‍్యలు చేశారు. ఓ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని అన్నారు. కానీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పడి.. పదేళ్లు కూడా కాకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల వేళ ఆయన ఇలా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

మరిన్ని వార్తలు