Arvind Kejriwal: అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

15 Jul, 2021 16:01 IST|Sakshi

గోవాలో ప్రకటించిన ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

పణజి: గోవాలో ఆప్‌ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. రెండో రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోవా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు హామీలను ప్రజలకు ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే పాత విద్యుత్‌ బిల్లులన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మారుస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ఉచిత విద్యుత్‌ పొందుతారని స్పష్టం చేశారు.

ఢిల్లీలోని ప్రజలు ప్రస్తుతం ఉచిత విద్యుత్‌ పొందుతున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు ఉచిత విద్యుత్‌ పొందితే గోవా ప్రజలు  ఎందుకు పొందలేరని ప్రశ్నించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు ముఖ్యనేతలను కలిశారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేసేవారికోసం తమ పార్టీ వెదుకుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలను ఆయన టార్గెట్‌ చేశారు.

ఎన్నికల ఫలితాల్లో 17 సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకోగా, 13 సీట్లను బీజేపీ గెలుచుకుందని గుర్తు చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌ తరఫున 5 మంది మిగలగా, మిగిలిన వారు వెళ్లి బీజేపీలో చేరారు. తాము ఓటేసిన నేతలు ఇతర పార్టీలకు మారపోవడంపై ప్రజలు మోసానికి గురైనట్లు భావిస్తున్నారని అన్నారు. వారంతా డబ్బుల కోసమే పార్టీ మారినట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు