Arvind Kejriwal: ఇప్పటికిప్పుడు సిసోడియా బీజేపీలో చేరితే.. కేంద్రంపై ధ్వజమెత్తిన కేజ్రీవాల్‌

1 Mar, 2023 18:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఆరోగ్యం, విద్యా రంగంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అరెస్ట్‌ అయిన మాజీ కేబినెట్‌ మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ను సమర్థిస్తూ సీఎం కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదని.. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని కేజ్రీవాల్‌ అన్నారు. మద్యం పాలసీలో ఎలాంటి అవినీతి లేదని.. అదంతా ఓ కట్టుకథ అని విమర్శించారు. రాజధానిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమలు జరగకూడదని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని మండిపడ్డారు. కానీ మోదీ కోరుకునేది ఎప్పటికీ జరగదని.. ఢిల్లీ అభివృద్ధి చెందడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.  20 రోజుల్లోగా కేబినెట్‌ విస్తరణ చేస్తామని తెలిపారు.

పంజాబ్‌లో ఆప్‌ గెలిచినప్పటి నుంచి మమ్మల్ని ఓర్వలేకపోతున్నారు. వాళ్లు బీజేపీ) ఆమ్‌ ఆద్మీని ఆపాలని చూస్తున్నారు. అవినీతిని ఆపడం వారి ఉద్దేశ్యం కాదు. ఢిల్లీలో జరుగుతున్న మంచి పనిని ఆపడమే ధ్యేయం. ఇంకోసారి అలా జరగదని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నాను. సిసోడియా నివాసంలో గంటల తరబడి దాడులు చేసిన సీబీఐ అధికారులు రూ.10,000 కూడా రికవరీ చేయలేకపోయారు. ఉన్నపళంగా మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ బీజేపీలో చేరితే వారిపై కేసులు ఉండవు. రేపటిలోగా  కేసు నుంచి బయటకు  తీసుకొస్తారు’ అంటూ కాషాయ పార్టీని ఉద్ధేశిస్తూ ధ్వజమెత్తారు.
చదవండి: ‘వారి టార్గెట్‌ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్‌ సిసోడియా

మరిన్ని వార్తలు