గుజరాత్‌లో కేజ్రీవాల్‌ భారీ రోడ్‌ షో.. తృటిలో తప్పిన ప్రమాదం

2 Apr, 2022 21:11 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం వారు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం అహ్మదాబాద్‌ వీధుల్లో తిరంగా యాత్ర పేరిట రోడ్ షో నిర్వ‌హించారు. ఎన్నికల వేళ  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల‌కు సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్‌ ఇలా పర్యటించడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే, ఈ ఏడాది చివరలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా కేజ్రీవాల్‌.. అధికార బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ర్యాలీలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. గుజ‌రాత్‌లో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోందిని ఆరోపించారు. వారు ప్ర‌జ‌ల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేరని విమర్శించారు.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను ఓడించ‌డానికి నేను ఇక్క‌డికి రాలేదు.. గుజ‌రాత్‌ను గెలుచుకునేందుకు వ‌చ్చానని ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. గుజ‌రాత్‌లో అవినీతిని రూపుమాపేందుకే ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు. ఆప్‌కు ఒక అవ‌కాశం ఇస్తే ఢిల్లీ, పంజాబ్‌ల మాదిరిగా గుజ‌రాత్‌ను తీర్చిదిద్దుతామ‌ని హామీ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా.. రోడ్‌ షో సందర్బంగా తృటిలో పెను ప్రమాదం తప‍్పింది. ఓ భ‌వ‌నంపై నుంచి వ్య‌క్తి కింద ప‌డిపోబోతుండగా కొంద‌రు వ్య‌క్తులు అతడిని రక్షించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేజ్రీవాల్‌, భ‌గ‌వంత్ మాన్ వెంట ఉన్న కొంద‌రు వ్య‌క్తులు ఆ భ‌వ‌నంలో ఉన్న వారిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకు రావ‌డం క‌నిపించింది.

మరిన్ని వార్తలు