దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్: రాహుల్‌కు అసదుద్దీన్‌ సవాల్‌

25 Sep, 2023 10:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ సమావేశంలో అసుదుద్దీన్‌ మాట్లాడారు.. ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కాంగ్రెస్‌ హయాంలోనే కూల్చివేశారని ధ్వజమెత్తారు.

‘లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీచేయాలని మీ నాయకుడిని (రాహుల్‌గాంధీ) చాలెంజ్‌ చేస్తున్నా. మీరు ఎప్పుడూ భారీ భారీ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో నాతో పోటీకి నిలబడండి. నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్‌ నేతలు ఎన్నో చెబుతారు. కానీ వారి హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదు కూల్చివేశారు’ అని ఓవైసీ మండిపడ్డారు.
చదవండి: ఆదానీతో కలిసి శరద్ పవార్.. ఇదేం ట్విస్టు..? 

అదే విధంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మతపరంగా దూషించిన వ్యాఖ్యలపై ఓవైసీ మాట్లాడుతూ.. పార్లమెంటులో ముస్లింల సామూహిత హత్యలు జరిగే రోజు ఎంతో దూరం లేదన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. దీనిపై దేశ ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు.

కాగా ఈ ఏడాది చివరల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ఒవైసీ ఈ సవాలు విసరడం విశేషం.

అంతకముందు ఈనెలలో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..ఎంఐఎంపై విమర్శలు చేశారు. తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటున్నామని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలతో పోరాడుతోందని తెలిపారు. అంతేగాక సీఎం కేసీఆర్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీలపై సీబీఐ, ఐడీ కేసులు లేవని, ప్రధాని మోదీ వారిని తన సొంత వ్యక్తులుగా బావిస్తున్నారని దుయ్యబట్టారు.

వీహెచ్‌ కౌంటర్‌
ఒవైసీ రాహుల్‌ గాంధీకి సవాల్‌ విసిరిన పరిణామంపై తెలంగాణ సీనియర్‌ నేత వీహెచ్‌ స్పందించారు. ఒవైసీకి రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు. అలాగే బీఆర్‌ఎస్‌తో పొత్తు రాజకీయంపైనా వీహెచ్‌, ఒవైసీని విమర్శించారు.

మరిన్ని వార్తలు