భారత్‌ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన

6 Aug, 2020 02:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: భారతదేశాన్ని హిందూ దేశంలా మార్చే ప్రయత్నం జరుగుతోందని, అయోధ్యలో రామమందిరానికి భూమిపూజ జరిగిన తీరే దీనికి నిదర్శనమని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ప్రజాస్వామ్య, లౌకిక విధానానికి కట్టుబడి ఉంటానని ప్రధానమంత్రి హోదాలో ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ ఇప్పుడు దాన్ని ఉల్లంఘించారన్నారు. వందల ఏళ్లనాటి మసీదును కూల్చి ఆ స్థలంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్టే కాశీ, మధుర సహా దేశంలోని పలు ప్రాంతాల్లో మసీదులను కూల్చే ప్రయత్నం కచ్చితంగా ప్రారం భమవుతుందన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మజ్లిస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం దారుసలాంలో విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోదీ ఏ ఒక్క మతానికీ  ప్రధానమంత్రి కాదని, ఈ దేశానికి ఏ మతమంటూ లేనందున రామమందిరం భూమిపూజలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. పైగా అయోధ్య రామమందిరం భారతదేశానికి సింబల్‌గా ఉంటుందనటం దారుణమన్నారు. రామమందిరం భూమిపూజ కోసం ప్రధాని ఓ వెండిరాయితో చేసిన శంకుస్థాపనను తాను భారత్‌ను హిందుత్వ దేశంగా మార్చే ప్రక్రియకు శంకుస్థాపనగా భావిస్తున్నట్టు వెల్లడించారు. భూమిపూజ జరిగిన ఆగస్టు 5ను ప్రధాని ఏకంగా పంద్రాగస్టుతో జోడిస్తూ మాట్లాడటం మరీ దారుణమన్నారు.

2 శతాబ్దాలపాటు పాలించిన ఆంగ్లేయులపై గెలుపునకు గుర్తుగా పంద్రాగస్టు నిర్వహిస్తున్నామని, మరి దేనిపై గెలుపుగా ఆగస్టు 5ను గుర్తుగా పేర్కొంటారని ప్రశ్నించారు. లౌకికవాదంపై హిందూత్వ విజయమా? అని ఎద్దేవా చేశారు. ప్రధాని పాల్గొన్న వేదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భాగవత్‌ ఉండటమే దీనికి నిదర్శనమన్నారు. కొత్త భారత్‌ను ఆవిష్కరిస్తున్నట్టు ప్రధాని చెప్పడం వెనుక  మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే కుట్ర ఉన్నదని ఆరోపించారు. సెక్యులర్‌ పార్టీలుగా పేర్కొనే పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ భూమిపూజ జరిగిన రోజును సోదరభావానికి ప్రతీకగా పేర్కొనటం మరీ దారుణమన్నారు. 1992 వరకు నమాజ్‌ చేసిన ప్రాంతంలో, ముస్లింల సమాధులున్న చోట మందిరం నిర్మిస్తున్నారని, తానిప్పటికీ దాన్ని మసీదుగా భావిస్తున్నానని, భవిష్యత్తులోనూ అలాగే భావిస్తానన్నారు.

సచివాలయంలో అదేచోట మసీదు నిర్మించాలి
కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణంపై ముఖ్యమంత్రి తమకు డెడ్‌లైన్‌తో సహా స్పష్టమైన హామీ ఇవ్వాలని అసదుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. పాత సచివాలయంలో మసీదు ఉన్న ప్రాంతంలోనే తిరిగి మసీదును నిర్మించాలన్నారు. ఇప్పటికే దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో ఆయనతో భేటీ కానున్నట్టు చెప్పారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు