-

సీఎం కేసీఆర్‌పై ఒవైసీ సంచలన కామెంట్స్‌..

15 Jul, 2023 16:03 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: దేశవ్యాప్తంగా ఉమ్మ‌డి పౌర‌స్మృతిపై తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, యూసీసీ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో పెట్టేందుకు అటు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి సంచలన కామెంట్స్‌​ చేశారు. యూసీసీని త‌మ పార్టీ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. 

ఇక, తాజాగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ వివాహ చ‌ట్టాన్ని పూర్తిగా మార్చ‌లేని వారు, యూసీసీని ఎలా అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీని ఓడించాల‌నుకుంటున్న విప‌క్ష పార్టీలు.. భిన్న‌మైన ఎజెండాతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు. ఇదే క్రమంలో విప‌క్ష పార్టీల కూట‌మికి సెటైరికల్‌ పంచ్‌ ఇచ్చారు. విపక్ష పార్టీల కూటమి చౌద‌రీల‌ క్ల‌బ్‌లా త‌యారైంద‌న్నారు. విప‌క్ష పార్టీల భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు ఆహ్వానించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్య‌క్తి కాదు అని, దేశ రాజ‌కీయాల్లో ఆయ‌న ముఖ్య పాత్ర పోషిస్తున్నార‌ని ఒవైసీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా, అంతకుముందకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఒవైసీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముస్లిం వ్యాపారుల వల్లనే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని శర్మ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్‌ ఇచ్చారు. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారైంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి ముస్లింలు(అసోంలో మియాలు) కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. ఇదే క్రమంలో మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా.. మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్‌?

మరిన్ని వార్తలు