‘అమెరికా ల్యాబ్‌లో తేల్చుకుందాం’

23 Jul, 2020 19:39 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలతో కొంత నీరసించినా, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ మాత్రం ప్రతిపక్షాలకు దీటుగా బదులిస్తున్నాడు. తాము విడుదల చేసిన ఆడియో టేపులు సరియైనవో కాదో అమెరికా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షిద్దామని బీజేపీకి సవాలు విసిరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌తోపాటు మరో ఇద్దరి ప్రమేయం వున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆడియో టేపులు విడుదల చేయడంతో రాజస్తాన్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

అయితే బీజేపీ వారు రాష్ట్ర దర్యాప్తు సంస్థలను, తాము బీజేపీకి చెందిన సీబీఐని విశ్వసించమని, అందువల్ల ఇరు పార్టీలు యూఎస్‌(అమెరికా)ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఆడియో టేపులను పరీక్షిద్దామని గెహ్లోత్‌ తెలిపారు. బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటీవల మోదీకి గెహ్లోత్‌ లేఖ రాశారు. మరోవైపు తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌పై మాటల దాడిని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కొనసాగించారు.

రాజస్థాన్ లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 200 కాగా, మ్యాజిక్ ఫిగర్ 101. నిన్నటి వరకు కాంగ్రెస్‌కు 107మంది సభ్యుల బలం ఉంది. సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్తాన్‌ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో త్వరలో తేలనుంది.

మరిన్ని వార్తలు