రెబల్‌ నేతలను ఉద్దేశించి అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యలు

12 Aug, 2020 14:27 IST|Sakshi

జైపూర్‌: దాదాపు నెల రోజుల పాటు రసవత్తరంగా సాగిన రాజస్తాన్‌ రాజకీయ సంక్షోభానికి రెండు రోజుల క్రితం తెర పడింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌తో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు జరిపిన మంతనాలు ఫలించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఒక మెట్టు దిగి వచ్చారు. జైసల్మెర్‌ హోటల్‌లో బస చేస్తున్న ఎమ్మెల్యేలతో నిన్న సాయంత్రం సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలను మర్చిపోయి.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను క్షమించి ముందుకు సాగాలని తన మద్దతుదారులను కోరారు గహ్లోత్‌. 

ఈ సందర్భంగా అశోక్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ.. ‘గత నెల రోజులుగా జరిగిన పరిణామాలు మనల్ని ఇబ్బందులకు గురి చేశాయి. తిరుగుబాటుదారుల వైఖరితో మనం బాధపడ్డాం. అయితే దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనం వారి తప్పులను క్షమించాలి. ప్రజాస్వామం కోసం ఇలా చేయక తప్పదు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. దాన్ని కాపాడటమే మన ప్రథమ కర్తవ్యం. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో చేసిన మాదిరిగానే రాజస్తాన్‌లో మన ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ మనం అలా జరగనివ్వలేదు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాం. ప్రజాస్వామ్యం కోసం మనం ఐక్యంగా ఉండాలి’ అని తన వర్గం ఎమ్మెల్యేలను కోరారు గహ్లోత్‌. (పైలట్‌ తొందరపడ్డారా!? )

తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అనంతరం అలక వీడారు. తిరుగుబాటుకు కారణం తెలిపారు. అశోక్‌ గహ్లోత్‌ తనను పనికిమాలిన వ్యక్తి అంటూ పరుష పదజాలంతో విమర్శించారని.. ఆయన ప్రవర్తన తనను తీవ్రంగా కలిచి వేసిందని.. అందుకే తిరుగుబాటు చేశానని తెలిపారు. అయితే తిరుగుబాటు నేతలను పార్టీలోకి తీసుకోవడం పట్ల మిగతా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన శిక్ష విధించకుండా వారిని పార్టీలోకి తీసుకోవద్దని కోరుతున్నారు. వారికి పదవులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అధిష్టానం వారిని క్షమించిందని.. మనం కూడా తప్పులను మర్చిపోయి క్షమించి ముందుకు సాగాలని అశోక్‌ గహ్లోత్‌ వారికి తెలిపారు. (రాజస్తాన్‌: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే!)

మరిన్ని వార్తలు