కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేస్తా..కానీ: అశోక్‌ గహ్లోత్‌

22 Sep, 2022 20:50 IST|Sakshi

జైపూర్‌: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ముఖ్యంగా అధ్యక్ష పదవికి ఎన్నిక హడావిడీ అంతా రాజస్థాన్‌ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపించినప్పటి నుంచి రాష్ట్రం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఒకవేళ గహ్లోత్‌ పోటీ చేస్తే రాజస్థాన్‌ సీఎంగా కొనసాగుతారా? లేదా తదుపరి సీఎం ఎవరవుతారనే చర్చ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఏమవుతుందో ఎదురుచుద్దాం!
ఈ క్రమంలో తాజాగా తాను కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయనున్నట్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ గురువారం ప్రకటించారు. అయితే రాష్ట్రానికి దూరంగా ఉండనని, రాజస్థాన్‌ కోసం ఎల్లప్పుడు పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌ పదవికి నేను నామినేషన్ దాఖలు చేస్తాను. ఆ తరువాత ఇతర ప్రక్రియ అమలులో ఉంటుంది. అలాగే ఎన్నిక కూడా జరగవచ్చు. ఇదంతా భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. 

ఎవరిమీద ప్రత్యేకంగా కామెంట్‌ చేయాలని అనుకోవడం లేదు. రాజస్థాన్‌లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో, కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రాజస్థాన్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇదంతా దీనిపై ఆధారపడి ఉంటుంది' అని అశోక్ గహ్లోత్‌’ అన్నారు.

రాజస్థాన్‌ నెక్ట్స్‌ సీఎం ఎవరూ?
ఇదిలా ఉండగా అశోక్‌ గహ్లోత్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైతే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు సీఎం పోస్టుకు గతంలో తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ముందు వరుసలో ఉన్నారు. కానీ సచిన్‌ సీఎం అవ్వడం గహ్లోత్‌కు నచ్చడం లేదు. దీంతో సీఎం పదవికి  అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి పేరును ఇప్పటికే ఆయన సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

పోటీలో పలువురు
తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ మేరకు బుధవారమే ఆయన సోనియా గాంధీని కలిశారు. అంతేగాక దిగ్విజయ్ సింగ్ తాను రేసులో ఉన్నానంటూ ముందుకు వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌  పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఏడు రాష్ట్రాల యూనిట్లు తీర్మానాలు చేశాయి. అయితే రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనే అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేడు(గురువారం) వెలువడింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. అక్టోబర్‌ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇక పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అధక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. అక్టోబర్‌ 19న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. .

మరిన్ని వార్తలు