రాజస్థాన్‌ సీఎంగా ఆయనే.. సచిన్ పైలట్‌కు కీలక పదవి!

1 Oct, 2022 12:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలతో సీఎం అశోక్ గహ్లోత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం పదవి నుంచి తప్పిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం సోనియా గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం రాజస్థాన్‌లో జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. తనను సీఎంగా కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై సోనియా గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

అయితే తాజాగా పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు రాజస్థాన్ సీఎంగా అశోక్ గహ్లోత్‌నే కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎంగా మరోసారి సచిన్ పైలట్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. 2020లో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేయడానికి ముందు వరకు పైలటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనను తప్పించారు. ఇప్పుడు మరోసారి ఆయనకే అవకాశం ఇవ్వనున్నారు.

అయితే గహ్లోత్‌కు, సచిన్ పైలట్‌కు అసలు పడదు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలకు కూడా ఇదే కారణం. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను కొత్త సీఎంగా నియమిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గహ్లోత్ వర్గం గత ఆదివారం పెద్ద రచ్చే చేసింది. 82 మంది ఎ‍మ్మెల్యేలు సీఎల్‍పీ సమావేశానికి డుమ్మా కొట్టి వేరుగా భేటీ అయ్యారు. అనంతరం పైలట్‌ను సీఎం చేస్తే రాజీనామా చేస్తామని బెదిరించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేశాయి.

అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో సీనియర్ నేత, దళితనాయకుడు మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపింది అధిష్ఠానం. ఈ పదవి కోసం సీనియర్ నేత, కేరళ ఎంపీ శశిథరూర్‌, జార్ఖండ్ కాంగ్రెస్ నేత ఆర్‌ఎన్ త్రిపాఠి కూడా పోటీ పడుతున్నారు. అయితే పోటీ ప్రధానంగా ఖర్గే, థరూర్ మధ్యే ఉండనుంది. గాంధీల వీరవిధేయుడైన ఖర్గేకే విజయావకాశాలు  ఎక్కువ అని అంతా భావిస్తున్నారు.
చదవండి: ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే..

మరిన్ని వార్తలు