విశ్వాస పరీక్షలో గహ్లోత్‌ గెలుపు

15 Aug, 2020 00:53 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న గహ్లోత్‌(ఫైల్‌)

పైలట్‌ వర్గం రాకతో లాంఛనంగా మారిన విజయం

అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శాంతి ధరివాల్‌

చర్చకు సమాధానమిస్తూ బీజేపీపై నిప్పులు చెరిగిన గహ్లోత్‌

సభలో తన సీటు మార్పుపై పైలట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జైపూర్‌: లాంఛనం ముగిసింది. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. సచిన్‌ పైలట్‌ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరడంతో బల నిరూపణ సునాయాసమైంది. దాంతో, ఎట్టకేలకు దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజస్తాన్‌ డ్రామా సుఖాంతమైంది.

శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, సభ ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. చర్చకు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సమాధానమిస్తూ విపక్ష బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘మీరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాను’ అని స్పష్టం చేశారు. ఈ సంక్షోభానికి అద్భుతమైన రీతిలో ముగింపు లభించిందని, బీజేపీ ఓడిపోయిందని పేర్కొన్నారు.

‘అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాల్లో ఏం జరిగింది? ప్రజా ప్రభుత్వాలను కూల్చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో స్వయంగా ఒక కేంద్రమంత్రి పాల్గొన్నారని గహ్లోత్‌ ఆరోపించారు. సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ, మధ్యవర్తి సంజయ్‌ జైన్‌ల గొంతులతో సంభాషణలున్న ఆడియో టేప్‌లను కాంగ్రెస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘మెజారిటీ ఉంటే ముందే విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలి.

నెల రోజుల పాటు ఎమ్మెల్యేలను హోటల్‌లో నిర్బంధించాల్సిన అవసరం ఏంటి?’ అని అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్‌ చంద్‌ కటారియా గహ్లోత్‌ను ప్రశ్నించారు. పైలట్‌పై స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ పెట్టిన దేశద్రోహం కేసు విషయాన్ని కూడా కటారియా ప్రస్తావించారు. ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని గెలిచిన అనంతరం సభను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 107. మిత్రపక్షాలు బీటీపీ(2), సీపీఎం(2), ఆరెల్డీ(1), స్వతంత్రులు(13)తో కలిసి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య 125 వరకు ఉంటుంది. బీజేపీ సభ్యుల సంఖ్య 72. మిత్రపక్షం(ఆర్‌ఎల్పీ 3)తో కలుపుకుని బీజేపీకి 75 మంది సభ్యుల మద్దతుంది.

ఇప్పుడు బోర్డర్లో ఉన్నా: పైలట్‌
చర్చలో సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన స్థానం ఇప్పుడు బోర్డర్లో ఉందని వ్యాఖ్యానించారు. పార్టీలో తాను శక్తిమంతమైన యోధుడినని పేర్కొన్నారు. గతంలో సీఎం గహ్లోత్‌ పక్కన కూర్చొనే పైలట్‌ స్థానం తాజా సమావేశాల సందర్భంగా మారింది. దీన్ని పైలట్‌ ప్రస్తావిస్తూ.. ఇప్పుడు తాను తన పార్టీ, విపక్షం మధ్య సరిహద్దులో యోధుడిలా ఉన్నానని పేర్కొన్నారు. ‘సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? అత్యంత బలమైనవాడినే పంపిస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ ప్రయోజనాలను కాపాడుతానన్నారు. ‘నా సీట్‌ మారేముందు నేను సేఫ్‌. ప్రభుత్వంలో భాగంగా ఉండేవాడిని. ఇప్పుడు నా స్థానం స్పీకర్, చీఫ్‌ విప్‌ ఎందుకు మార్చారా అని రెండు నిమిషాలు ఆలోచించాను.

ఇది విపక్షంతో పోరాటంలో కీలకమైన బోర్డర్‌ స్థానం అని అర్థం చేసుకున్నా. నాకు ఒకవైపు అధికార పక్షం. మరోవైపు ప్రతిపక్షం. సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? శక్తిమంతుడైన యోధుడినే కదా!’ అన్నారు. ‘మా సమస్యలను డాక్టర్‌కు వివరించాం. చికిత్స తరువాత ఇప్పుడు మొత్తం 125 మంది సభ్యులం ఇక్కడ సభలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. తిరుగుబాటు అనంతరం, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పైలట్‌ సమావేశమై రాష్ట్ర నాయకత్వంపై తన ఫిర్యాదులను వివరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సయోధ్య కుదిరి తిరిగి ఆయన పార్టీ గూటికి వచ్చారు. అదే విషయాన్ని ఆయన డాక్టర్‌ను కన్సల్ట్‌ అయినట్లుగా నర్మగర్భంగా వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు