రాజస్థాన్‌ సీఎంగా తప్పుకోనున్న అశోక్ గహ్లోత్!

25 Sep, 2022 15:06 IST|Sakshi

జైపూర్‌: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లోని అశోక్ గహ్లోత్‌ నివాసంలో ఆదివారం రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. సీఎం మార్పు తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ కీలకంగా మారింది.

రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కొత్త సారథిని నిర్ణయించే అధికారం అధ్యక్షురాలు సోనియా గాంధీకే వదిలేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సచిన్ పైలట్‌ను నూతన సీఎం చేయడం గహ్లోత్‌కు ఇష్టం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సచిన్ పైలట్‌కు గాంధీల నుంచి హామీ వచ్చిందని, ఆయనే తదపరి సీఎం అని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేగాక తాను నామినేషన్ సమర్పించిన తర్వాతే రాజస్థాన్ కొత్త సీఎంపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నాయి.

జైపూర్‌లో జరిగే ఈ సమావేశానికి పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ మాకెన్ హాజరుకానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఖర్గేను పరిశీలకుడిగా సోనియా గాంధీ నియమించారు.

అక్టోబర్‌ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24న మొదలై 30వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువుంది. ఎన్నికలు జరిగిన రెండో రోజు అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు.
చదవండి: ‘70 ఏళ్లలో ఏ నాడూ దేశం ఇలా కాలేదు’

మరిన్ని వార్తలు