కాంగ్రెస్‌ వల్లే సజీవంగా ప్రజాస్వామ్యం .. 32 ఏళ్లలో ఏ పదవీ చేపట్టని కుటుంబం అది!

23 Aug, 2022 08:00 IST|Sakshi

ఢిల్లీ/జైపూర్‌: షెడ్యూల్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ 20వ తేదీన పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకుని తీరతామన్న కాంగ్రెస్‌ పార్టీ ఎలక్షన్‌ అథారిటీ ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. మూడు, నాలుగు రోజుల్లో అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా రాహుల్‌ గాంధీ పేరే ప్రధానంగా వినిపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలంతా రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, సెంటిమెంట్‌ను ఆయన గౌరవించి.. బాధ్యతలు చేపట్టాలి అని గెహ్లాట్‌ పేర్కొన్నారు. 

ఒకవేళ రాహుల్‌ గాంధీ గనుక పార్టీ ప్రెసిడెంట్‌ కాకుంటే.. పరిణామాలు చాలా ప్రతికూలంగా మారతాయి. కాంగ్రెస్‌ కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోతుంది. చాలామంది ఇళ్లలోనే ఉండిపోతారు. మేమంతా(సీనియర్లను ఉద్దేశించి) ఇబ్బంది పడతాం. కాబట్టి, సెంటిమెంట్‌ను గౌరవించి తనంతట తానుగా ఆయన ఈ పదవికి స్వీకరిస్తే మంచిది అని గెహ్లాట్‌ మీడియాతో వెల్లడించారు. 

గాంధీ కుటుంబమా? కాదా? అనే ఇక్కడ సమస్య కాదు. పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకే అప్పగించాలని చాలామందే కొరుకుంటున్నారు. ఇది ఏకగ్రీవ అభిప్రాయం. ఆయన అంగీకరిస్తేనే మంచిది. గత 32 ఏళ్లుగా ఆ కుటుంబ నుంచి ఎవరూ కూడా ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి.. ఇలా ఎలాంటి పదవి చేపట్టలేదు. అలాంటిది మోదీగారికి ఆ కుటుంబం అంటే ఎందుకు భయం పట్టుకుందో అర్థం కావడం లేదు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 75 ఏళ్ల భారతంలో ఏం జరగలేదని వ్యాఖ్యానిస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్రతీ ఒక్కరూ కాంగ్రెస్‌నే ఎందుకు టార్గెట్‌ చేసుకుని.. విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు అని గెహ్లాట్‌ పేర్కొన్నారు.
 
దేశం- కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒక్కటి కావడమే ఇందుకు కారణం. కాంగ్రెస్‌ అన్ని మతాలకు, వర్గాలకు చెందిన పార్టీ కావడమే మరో కారణం అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి తెలిపారు. 75 ఏళ్ల భారతంలో కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచింది. కాబట్టే ఇప్పుడు మోదీ దేశానికి ప్రధాని, కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారంటూ చురకలు అంటించారు గెహ్లాట్‌.

ఇదీ చదవండి: కశ్మీర్‌లో స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్‌

మరిన్ని వార్తలు