ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం

26 Jul, 2020 05:32 IST|Sakshi
జైపూర్‌లో ఎమ్మెల్యేలు ఉన్న హోటల్‌ నుంచి వెళ్తున్న సీఎం గహ్లోత్‌

సంక్షోభాన్ని పరిష్కరించాలని రాష్ట్రపతిని కోరతామన్న రాజస్తాన్‌ సీఎం గహ్లోత్‌

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసనలు

31న అసెంబ్లీని సమావేశ పరచాలంటూ గవర్నర్‌ను కోరనున్న గహ్లోత్‌

జైపూర్‌/న్యూఢిల్లీ: రాజస్తాన్‌ రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని రాష్ట్రపతిని కలిసి కోరతామనీ, అవసరమైతే ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగుతామని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరాలని రాష్ట్ర కేబినెట్‌ శనివారం తీర్మానించింది.

బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం జైపూర్‌లోని ఓ హోటల్‌లో మకాం వేసిన తమ విధేయ ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్‌ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గహ్లోత్‌.. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామన్నారని పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు.

హోటల్‌లో కనీసం మరో 21 రోజులు మకాం కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఎమ్మెల్యేలను కోరారన్నారు. మెజారిటీ సభ్యుల బలం తమకు ఉన్నందున బీజేపీ కుట్రలేవీ సాగవని తెలిపారన్నారు. రాజ్యాంగాన్ని లోబడి నడుచుకుంటున్నాననీ, తనపై ఎటువంటి ఒత్తిడులు లేవని గవర్నర్‌ మిశ్రా చెప్పడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌ ఎదుట ఆందోళనకు విరమించారు.

అయితే.. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఏ మేరకు ఉంది, ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ సభను సత్వరమే సమావేశ పరచాలనే డిమాండ్‌కు కారణం తదితర ఆరు అంశాలపై స్పష్టతనివ్వాలని సీఎం గహ్లోత్‌ను గవర్నర్‌ కోరారు. దీంతో శనివారం సీఎం గహ్లోత్‌ నేతృత్వంలో కేబినెట్‌ సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈనెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరాలని నిర్ణయించింది. అయితే, గవర్నర్‌తో ముఖ్యమంత్రి గహ్లోత్‌ భేటీపై తుది నిర్ణయం తీసుకోలేదు.

కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలు
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నిందంటూ కాంగ్రెస్‌ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు జైపూర్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని గవర్నర్‌ను డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌æ ఆరోపించారు.

అరాచక వాతావరణం సృష్టించింది: బీజేపీ
రాజస్తాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచక వాతావరణం సృష్టించిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీని సమావేశపరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్‌తో గవర్నర్‌ కార్యాలయాన్ని భయపెట్టేందుకే రాజ్‌భవన్‌ ఎదుట  గహ్లోత్‌ ఆందోళన చేపట్టారని ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందం శనివారం గవర్నర్‌ మిశ్రాను కలిసివినతి పత్రం అందజేసింది.

అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత గులాబ్‌ చంద్‌ కటారియా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ హక్కు పేరుతో రాజ్‌భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ఆడిన డ్రామా దురదృష్టకరం. ఏ ఎజెండా లేకుండానే శాసనసభను సమావేశపరచాలని ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ఇలా గవర్నర్‌పై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విలువలను అగౌరవపరచడమే’ అని ఆయన అన్నారు. ï రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్‌ను కోరారా? అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు