అవునా.. వాళ్లు హెటల్‌లో ఉన్నారా?: అస్సాం సీఎం, షిండే వ్యాఖ్యలపై దాటవేత

24 Jun, 2022 08:08 IST|Sakshi

Maharashtra Political Crisis: ముంబై/గువాహతి: శివ సేన రెబల్‌ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తెచ్చిన ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే.. వాళ్లను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. గువాహతి(అసోం) రాడిసన్‌ బ్లూ హోటల్‌లో బస చేసి.. వాళ్లతో గంట గంటకు సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో..  అస్సాం (అసోం) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అస్సాంలో ఎన్నో మంచి హోటల్స్‌ ఉన్నాయి. ఎవరైనా రావొచ్చు.. ఉండొచ్చు. అందులో ఎలాంటి సమస్యా లేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అస్సాంలో ఉంటున్నారో లేదో నాకు తెలియదు. అయ్యి ఉండొచ్చు.  ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇక్కడి హోటల్స్‌లో ఉండొచ్చు. అందులో అభ్యంతరాలు ఏం లేవు.. అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. 

‘‘మన బాధలు.. సంతోషం ఒక్కటే. అంతా ఒక్కటిగా ఉంటే విజయం మనదే. ఓ జాతీయ పార్టీ.. పాకిస్థాన్‌ను దెబ్బ కొట్టే సత్తా ఉన్న ‘మహాశక్తి’ మనకు అండగా ఉంటామని మాట ఇచ్చింది. అవసరమైన సాయం చెప్పింది’’ అంటూ ఏక్‌నాథ్‌ షిండే చేసిన వ్యాఖ్యల తాలుకా వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. అస్సాం మంత్రి అశోఖ్‌ సింఘాల్‌ గురువారం ఉదయం స్వయంగా రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లి.. ఏక్‌నాథ్‌ షిండేతో భేటీ అయ్యారు. దీంతో ఆ పార్టీ బీజేపీనేనా? అని అస్సాం సీఎం హిమంతకు ప్రశ్న మీడియా నుంచి ఎదురుకాగా.. ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉంటే.. షిండే వర్గంలో మొత్తం 37 మంది శివ సేన ఎమ్మెల్యేలు(అనర్హత నుంచి గట్టెక్కే మ్యాజిక్‌ ఫిగర్‌)తో పాటు మరో 9 మంది ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకోవైపు ‘అనర్హత వేటు’ మంత్రం ద్వారా రెబల్‌ గ్రూప్‌ను వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్న శివ సేన.. వాళ్లంతా ముంబైకి చేరితేగనుక పరిస్థితి సర్దుమణగవచ్చన్న ఆశాభావంలో ఉంది.

చదవండి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన ప్రకటన

మరిన్ని వార్తలు