సీఎం భార్య పై ఆరోపణలు.. కాంగ్రెస్‌ ఎంపీపై 10 కోట్ల పరువు నష్టం దావా!

23 Sep, 2023 19:09 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ ఏకంగా రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమె గొగోయ్‌కు నోటీసులు పంపారు.  

కామ్‌రూప్ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం కేసు దాఖలు చేశామని, ఇది సెప్టెంబర్ 26న విచారణకు రానుందని భుయాన్‌ తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా చెబుతున్నారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా పలు ట్వీట్ల ద్వారా గౌరవ్ గొగోయ్ తన క్లయింట్ రినికి భుయాన్ శర్మకు నష్టం కలిగించారని, అందుకే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ తన క్లయింట్ రినికికి చెందిన కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

కాగా, ఓ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం కోసం అవకతవకలకు పాల్పడ్డారని గొగోయ్ ఆరోపించారు. అయితే.. తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు  ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్‌ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు పెట్టారు.

మరిన్ని వార్తలు