Conrad Sangma: ఈశాన్యంలో ఆశాదీపం..

5 Feb, 2022 11:18 IST|Sakshi

షిల్లాంగ్‌: తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, అంతర్జాతీయ యూనివర్సిటీల్లో నేర్చుకున్న బిజినెస్‌ పాఠాలు, గిరిజనులకు సేవ చేయాలన్న సంకల్పంతో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి  కాన్రాడ్‌ కె సంగ్మా  ఈశాన్య ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి, లోక్‌సభ దివంగత స్పీకర్‌ పీఏ సంగ్మా వేసిన బాటలో నడుస్తూ ఎన్‌పీపీని ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ పార్టీ స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు.

మణిపూర్‌ గిరిజనుల హక్కులను కాపాడడం కోసం అవతరించిన పార్టీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి అధికారాన్ని దక్కించుకోవాలన్నది సంగ్మా ఆశ. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. గిటార్, పియానో వాయిస్తారు. ప్రయాణాలు చేయడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి.  గిరిజనులకు ఆశాదీపంలా మారిన తమ పార్టీని వాళ్లే ఆదుకుంటారన్న వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు.

బీజేపీ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి సొంతంగా పోటీకి దిగి మణిపూర్‌లోనూ అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. మేఘాలయా సీఎంగా ఉంటూనే మణిపూర్‌లో కూడా పార్టీని కింగ్‌మేకర్‌గా నిలపాలని ఆరాటపడుతున్నారు.

►  పీఏసంగ్మా దంపతులకు 1978వ సంవత్సరం, జనవరి 27న మేఘాలయలోని తురాలో జన్మించారు.  
►   ఢిల్లీలో పెరిగారు. సెయింట్‌ కొలంబియాలో ప్రాథమిక విద్య అభ్యసించారు.  
►   అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి బీబీఏ, లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ నుంచి ఎంబీఏ చేశారు.
►   డాక్టర్‌ మెహతాబ్‌ అజితోక్‌ను పెళ్లాడిన సంగ్మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
►   తండ్రి పీఏ సంగ్మా ఎన్‌సీపీలో ఉన్నప్పుడు ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు.
►  2003లో తొలిసారిగా ఎన్‌సీపీ నుంచి సెల్‌సెల్లా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 182 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
►   2008లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆర్థిక, విద్యుత్, ఐటీ మంత్రిగా పగ్గాలు చేపట్టారు.  
►   ఎన్నికల్లో విజయం సాధించిన పదిరోజుల్లోనే ఆర్థిక మంత్రిగా మేఘాలయ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత సాధించారు.
►   2009–2013 వరకు మేఘాలయలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
►   2016 మార్చిలో సంగ్మా మరణానంతరం ఎన్‌పీపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది తుర లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఉపఎన్నికల బరిలోకి దిగి 1.92 లక్షల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.  
►  2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటు చేసి మేఘాలయ సీఎం అయ్యారు.  
►   పీఏ సంగ్మా ఫౌండేషన్‌ చైర్మన్‌గా విద్య, పర్యావరణ రంగాల్లో కృషి చేస్తున్నారు.  
►  కిందటి మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన ఎన్‌పీపీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. 
►  ముఖ్యమంత్రి ఎన్‌.బైరన్‌ సింగ్‌పై వ్యతిరేకతతో ఒకానొక దశలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కూడా అనుకున్నారు కాన్రాడ్‌ సంగ్మా.  
►   ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌తో రాజీకొచ్చిన సంగ్మా ఈసారి కూడా తనకున్న చరిష్మా మీదే పార్టీకి అత్యధిక స్థానాలు లభించేలా వ్యూహాలు పన్నుతున్నారు.  
►   రాష్ట్రంలో ఎన్‌పీపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న సంగ్మా మణిపూర్‌ ఎన్నికల భారం అంతా ఒంటి చేత్తో మోస్తున్నారు.  
►   హిందూ మైటీ, ముస్లిం మైటీ–పంగల్‌ వర్గాలకు ఎస్‌టీ హోదా, నాగాల సమస్యలకు శాంతియుత పరిష్కారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ వంటి అంశాలపై సంగ్మా అలుపెరుగని పోరాటమే చేస్తున్నారు.      

– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు