ట్రంప్‌ కన్నా ఘోరం: మమత

7 Apr, 2021 01:49 IST|Sakshi

ఎన్నికల్లో గెలుపు కోసం దారుణాలు చేస్తున్నారని ఆరోపణ

కల్చిని: బీజేపీకే ఓటేయాలంటూ కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరిస్తున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మూడో దశ ఎన్నికల సందర్భంగా ‘బీజేపీ కో ఓట్‌ దో’ అంటూ ఓటర్లపై దాడి చేస్తున్నాయన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ బలగాల అకృత్యాలను ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ వారు పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకుని, అక్రమంగా ఓట్లు వేసుకుంటున్నారన్నారు. మమత మంగళవారం పలు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. కేంద్ర బలగాలు, బీజేపీ కార్యకర్తల దాడుల గురించి ఉదయం నుంచి తనకు 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. బీజేపీ అగ్రనేతల సభలకు ప్రజలు రాకపోవడంతో వారు ఢిల్లీలో కూర్చుని ఈ కుట్రకు తెరతీశారని విమర్శించారు. బీజేపీకి మద్దతుగా నిలవాలని కేంద్ర బలగాలను ఆదేశించారన్నారు.

‘తుపాకులతో ఈ ఎన్నికలను వారు నియంత్రించాలని అనుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా మోదీ అంత దారుణంగా వ్యవహరించలేదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలు వేధిస్తే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహిళలకు సూచించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. ‘పెద్ద హోటళ్లలో అన్ని రూమ్స్‌ను బుక్‌ చేసుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచిపెడ్తున్నారు. ఈ డబ్బంతా వారికి ఎక్కడ్నుంచి వచ్చింది? పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచా? నోట్ల రద్దు నుంచా? ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం నుంచా?’ అని ప్రశ్నించారు.  మతం పేరుతో ఊచకోతకు పాల్పడిన వారు ఉన్న పార్టీ బీజేపీ అని ఆరోపించారు. ‘గుజరాత్, ఢిల్లీ, అస్సాం, యూపీలో మతం పేరుతో హత్యలు చేశారు. ఇప్పుడు బెంగాల్‌కు వచ్చారు’ అని మమత మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు