UP Assembly Election 2022: కాంగ్రెస్‌ తొలి జాబితా .. ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్‌

13 Jan, 2022 12:27 IST|Sakshi

లక్నో: అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ సహా మిగతా పార్టీలన్నీ తీవ్ర కసరత్తు ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న తరుణంలో తమ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఈ క్రమంలో 125 మంది అభ్యర్థులతో  కూడిన కాంగ్రెస్‌ తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు టికెట్‌ ఇచ్చినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

125 మందిలో 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 40 శాతం యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గౌరవ వేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్‌ పూనమ్‌ పాండే షాజహాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రియాంక చెప్పారు. మహిళలు, యువతకు కాంగ్రెస్‌ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని, తమ నిర్ణయంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆమె అన్నారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 
చదవండి: అయోధ్య నుంచి యోగి పోటీ! 

మరిన్ని వార్తలు