బీజేపీ రివర్స్‌ పంచ్‌! ఎస్పీ చీఫ్‌ సోదరుడి భార్య అపర్ణకు బీజేపీ గాలం?

17 Jan, 2022 14:43 IST|Sakshi

ములాయం కుటుంబంలో చిచ్చు పెట్టేలా ఎదురుదాడి

ముగ్గురు ఓబీసీ మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేల (ఇందులో ఇద్దరు బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్‌–ఎస్‌’కు చెందిన వారు)ను చేర్చుకొని ఊపుమీదున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. అఖిలేశ్‌ సవతి సోదరుడైన ప్రతీక్‌ యాదవ్‌ భార్య అపర్ణా యాదవ్‌కు కండువా కప్పేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అపర్ణ కొంతకాలంగా మోదీ ప్రభుత్వ విధానాలకు బాహటంగా మద్దతు పలుకుతున్నారు.

ఆమెతో బీజేపీ టచ్‌లో ఉంది. ఇరుపక్షాల మధ్య అపర్ణ పార్టీ ఫిరాయింపుపై చర్చలు జరుగుతున్నాయని... ఇప్పుడవి ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్‌ స్థానం నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి, సీనియర్‌ నాయకురాలు రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఫిబ్రవరి– మార్చిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్‌ సీటునే అడుగుతున్నట్లు వినికిడి. అయితే సీనియర్‌ రీటా బహుగుణను కదపడం ఇష్టం లేని బీజేపీ ములాయం సింగ్‌ కోడలిని మరో చోటు నుంచి పోటీ చేయించాలని చూస్తోంది.  

కుంభస్థలాన్ని కొట్టాలని...
బీజేపీ నుంచి ఎస్పీకి ఇటీవలి వలసలతో కమలదళం లోలోపల రగిలిపోతోంది. పెద్ద ఎత్తున ప్రతిదాడి చేయకపోతే బీజేపీ చేష్టలుగిడి చూస్తోందనే అభిప్రాయం బలపడుతుంది. అందుకే అపర్ణా యాదవ్‌కు గాలం వేసింది. తమ్ముడి భార్యను ఆపలేకపోతే... అఖిలేశ్‌ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో తనతో విబేధించి వేరుకుంపటి పెట్టుకున్న బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ (ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ– లోహియా)తో అఖిలేశ్‌ ఇటీవలే సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే అన్నట్లుగా బీజేపీ వ్యతిరేకంగా చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుపోతున్నారు. ఇప్పుడు బీజేపీ అపర్ణను లాగేస్తే... మళ్లీ ఇంటిపోరు మొదలైనట్లే. ‘మా జోలికొస్తే ఊరుకుంటామా? మీ ఇంటికొస్తాం.. నట్టింటికొస్తాం’ అన్నట్లుగా బీజేపీ ప్రతిదాడికి దిగింది. ములాయంసింగ్‌ ఇంట్లో చిచ్చు పెట్టడం ద్వారా ఎస్పీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టవచ్చేనేది కమలనాథుల వ్యూహం. ములాయంసింగ్‌ రెండో భార్య సాధనా గుప్తాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ప్రతీక్‌ యాదవ్‌.                  
– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు