Elections 2023: రిజల్ట్‌ చూద్దాం.. మజా చేద్దాం!

1 Dec, 2023 17:08 IST|Sakshi

సినిమా కాదు.. క్రికెట్‌ మ్యాచ్‌ అంతకంటే కాదు

కానీ, ఈ ఆదివారం సిసలైన మజాను కోట్ల మంది ఆస్వాదించబోతున్నారు

ఎలాగంటారా?..

డిసెంబర్‌ 3.. రాజకీయ పార్టీలకు బిగ్‌డే 

చార్‌ పటాకా బద్ధలయ్యే రోజది

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌.. మూడు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుపై నెలకొన్న ఆసక్తి

ఇక ఇటు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు, ప్రధాన పార్టీల నడుమ విజయధీమాలతో  తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన వేళ.. 

ఓడేదెవరు? నెగ్గేదెవరనేది పక్కనపెడితే.. ఈ సూపర్ సండే మాంచి కిక్కు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.. 


రాజస్థాన్‌

చెరో దఫా ప్రభుత్వాల్ని ఇక్కడ కాంగ్రెస్‌-బీజేపీలు గత మూడు దశాబ్దాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే.. గత మూడేళ్లుగా నడుస్తున్న గ్రూప్‌ రాజకీయాల నేపథ్యంలో ఈసారి రాజస్థాన్‌లో ఎవరు సర్కార్‌ను నెలకొల్పుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

ఇప్పుడున్న రాజస్థాన్‌ అసెంబ్లీ గడువు జనవరి 14, 2024తో ముగియనుంది. ఈలోపు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.  200 స్థానాలు ఉన్న రాజస్థాన్‌ అసెంబ్లీకి.. 199 స్థానాలకు(ఒక దగ్గర అభ్యర్థి మరణంతో ఎన్నిక నిలిపివేశారు) నవంబర్‌ 25వ తేదీన పోలింగ్‌ జరిగింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 75.45% పోలింగ్‌ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 స్థానాలు రావాల్సి ఉంటుంది. 

ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల ప్రభావం తమను మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్‌.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పేరుకుపోవడంతో పాటు తాము ఇచ్చిన ఎన్నికల హామీలకు ప్రజలు పట్టం కడతారని బీజేపీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు హోరాహోరీ పోటీనే చూపిస్తున్నాయి ఇక్కడ. 

మధ్యప్రదేశ్‌
కిందటి ఎన్నికల్లో నెగ్గి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశామనే సంతోషం కాంగ్రెస్‌కు రెండేళ్లే ఉంది. తిరుగుబావుటా నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కార్‌​ కుప్పకూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిణామాలు.. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

మధ్యప్రదేశ్‌లో ఇప్పుడున్న అసెంబ్లీ గడువు జనవరి 6, 2024తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నవంబర్‌ 17వ తేదీన పోలింగ్‌ జరిగింది. మొత్తంగా 5.6 కోట్ల ఓటర్లకుగానూ..  77.15 శాతం నమోదు అయ్యింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు రావాల్సి ఉంటుంది. 

మధ్యప్రదేశ్‌లో ఈ ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. గత ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌.. రెండేళ్లు తిరగకముందే 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కుప్పకూలింది. సరిపడా బలం కమల్‌నాథ్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్‌లు ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల్లో సగం బీజేపీకి అనుకూలంగా.. సగం హంగ్‌ చూపిస్తుండగా.. ఓటర్‌ పల్స్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి నెలకొంది. 


ఛత్తీస్‌గఢ్‌
వరుసగా మూడు పర్యాయాలు(2003 నుంచి 2018 దాకా) సంపూర్ణ పాలన కొనసాగించిన బీజేపీకి చెక్‌ పెడుతూ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తుంటే.. కంచుకోటను చేజిక్కించుకుని తీరతామంటూ బీజేపీ ధీమా కనబరుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ గడువు జనవరి 3, 2024తో ముగియనుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు ఫేజ్‌ల్లో నవంబర్‌ 7న, నవంబర్‌ 17న పోలింగ్‌ నిర్వహించింది ఈసీ. మొత్తం కోటి 63 లక్షల ఓటర్లు ఉండగా.. 76 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 46 రావాలి. 

రూరల్‌ డెవలప్‌మెంట్‌ అనేది ప్రధాన అస్త్రంగా.. సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ నమ్ముకుంది. మరో వైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది.   మరోవైపు..  అద్భుతం జరిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని,  కాంగ్రెస్​ ఈ సారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశముందని, ఇవేవీకావు.. బీజేపీ ఏకపక్షంగా నెగ్గుతుందని ఇలా రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి అక్కడ. ఈ తరుణంలో.ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం ఛత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ అంచనా వేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. 


తెలంగాణ

గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌.. హ్యాట్రిక్‌ కొడతామంటోంది.  ఈ పదేళ్లలో ఘోరంగా అవినీతి జరిగిందని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి వెళ్లిందని.. అది తమకు అధికారం కట్టబెడుతుందని ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీలు చెప్పుకుంటున్నాయి. సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు.. ఈలోపే ఏకపక్షంగా వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు.. గెలుపుపై ఎవరికి వాళ్లే వ్యక్తం చేస్తున్న ధీమా పరిణామాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరిపించడం ఖాయంగా కనిపిస్తోంది.      

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇప్పుడున్న అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16, 2024తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 30 తేదీన పోలింగ్‌ జరిగింది. మొత్తం 3.26 కోట్ల ఓటర్లు ఉండగా.. 70 శాతం పైనే ఓటింగ్‌ నమోదు అయ్యిందని అంచనా. అంటే.. దాదాపు కోటి మంది దాకా పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి 119 స్థానాలు ఉండగా.. అధికారం ఏర్పాటు చేయాలంటే 60 సీట్ల మెజారిటీ అవసరం.

పదేళ్ల పాలన ప్రచార అస్త్రంగా బీఆర్‌ఎస్‌.. అత్యధిక సీట్లతో, మూడోసారి విజయంతో రికార్డు నెలకొల్పుతామని అంటోంది. ఇక ఈ పాలనలోనే జరగని అవినీతి లేదంటూ బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ప్రచారంతో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లాయి. సర్వేలు ఒకలా.. ఎగ్జిట్‌పోల్స్‌ మరోలా రావడంతో ఓటర్‌ పల్స్‌పై గందరగోళమే నెలకొంది. పైగా సాయంత్రం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లడంతో..  తెలంగాణలో ఈసారి ఓటింగ్‌ గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారనే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత ఆ బెట్టింగ్స్‌ తారాస్థాయికి చేరాయంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏమేర ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. 

మొత్తం మీద.. ఈ ఆదివారం డిసెంబర్‌ 3న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.. నాయకుల గెలుపొటములతో.. పార్టల సంబురాలు-నిరుత్సాహాలతో కోట్ల మందికి(ప్రత్యేకించి ఓటర్లకు..) ఇత్యాది పరిణామాలు మస్త్‌ మజాను అందించబోతున్నాయి! 

మరిన్ని వార్తలు