అక్బర్‌ పోటీ చేస్తామన్న 50 స్థానాల్లో కరీంనగర్‌.. అసెంబ్లీ జంగ్‌లో పతంగ్‌!

12 Feb, 2023 18:01 IST|Sakshi
పార్టీ పతాకం...ఎంఐఎం అధినేత ఒవైసీ(ఫైల్‌) 

సాక్షి, కరీంనగర్‌:  ‘షహర్‌ హమారా.. మేయర్‌ హమారా’ అంటూ హైదరాబాద్‌ పాతబస్తీలో మొదలైన ముస్లిం ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) ప్రస్థానం క్రమంగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. గతవారం అసెంబ్లీలో మజ్లిస్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రవ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మజ్లిస్‌ పాతబస్తీ పార్టీగానే అందరికీ తెలుసు.

పాత హైదరాబాద్‌లోని గుల్బర్గా (కర్ణాటక), మరాఠ్వాడా (మహారాష్ట్ర) తెలంగాణ లోకల్‌ బాడీస్‌కే పరిమితమైంది. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్‌ రాష్ట్రాల్లో పోటీ చేసింది. అయితే, సొంతరాష్ట్రంలో మాత్రం పార్టీని విస్తరించలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ దాటికి బయటికి రావాలని మజ్లిస్‌ సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

కరీంనగర్‌లో 60 వేల ఓట్లు..!
ప్రస్తుతం కరీంనగర్‌ ఓటర్ల సంఖ్య 3.30 లక్షల పైమాటే. అందులో 59,270 వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మజ్లిస్‌ ప్రకటన ఆకస్మికంగా చేసింది కాదు. దీని వెనక పెద్ద కసరత్తే జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు తమకు బ లం ఉన్న 50 స్థానాల్లో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచి్చంది. అందులో భాగంగానే ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ ఉన్నాయని సమాచారం.

ఇందుకోసం కరీంనగరంలోని ఓటర్ల సమాచారం మొత్తం సేకరించారు. దారుస్సలాం ఆదేశాల మేరకు.. ప్రత్యేక యాప్‌లో మొత్తం ఓటర్ల సమాచారం నిక్షిప్తం చేశారు. మొత్తం దాదాపు 390 పోలింగ్‌ బూత్‌ల వారీగా.. హిందూ, ముస్లింలు.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, పురుషులుగా విభజించారు. కరీంనగర్‌లో 30 వేలకుపైగా ఉన్న ఎస్సీలు తమతో కలిసి వస్తారన్న ధీమాతో మజ్లిస్‌ ఉంది.

కొత్త ఓట్ల నమోదుకే డివిజన్ల పర్యటన..
కరీంనగర్‌లో 60 వేలకుపైగా ఓటర్ల బలం ఉన్న నేపథ్యంలో పోటీ చేసే పరిస్థితి వచ్చినా.. మద్దతిచ్చే నిర్ణయం తీసుకున్నా.. దేనికైనా సిద్ధంగా ఉండాలని దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధంగా ఉన్నారని సమాచారం. అందుకే.. ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వారం రోజులుగా డివిజన్ల పర్యటనకు ఎంఐఎం శ్రీకారం చుట్టింది. తమ ఓటర్లు ఉన్న 35 డివిజన్లలో కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నది దీని వెనక అసలు ఉద్దేశం. ఇప్పుడున్న ఓటర్లకు కనీసం నాలుగైదు వేలు యువ ఓటర్లు ఉంటారని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు.

ఎంఐఎం వెంట ఎస్సీలు నడుస్తారా?
మొత్తం కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ను మజ్లిస్‌ కులం, మతం అనే అంశాల ఆధారంగా డేటా వర్గీకరించింది. 81.5% హిందూ జనాభా, 18.5% ముస్లిం జనాభా అని రెండు రకాలుగా విభజించింది. అందులో హిందువుల్లో 81.5% మందిలో మరో 14.5% వరకు అంటే దాదాపు 30 వేల నుంచి 40 వేల వరకు ఎస్సీలు కూడా ఉన్నారని.. మొత్తం తమకు 80 వేలమంది మద్దతు దొరుకుతుందని ఎంఐఎం ధీమాగా ఉంది.

అదే సమయంలో నగరంలో ఉన్న ముస్లింలలో ఎందరు ఎంఐఎం వెంట నిలుస్తారు? రూ.10 లక్షల ఆర్థిక సాయంతో దళితబంధులాంటి భారీ సంక్షేమ పథకాలు అమలువుతున్న నేపథ్యంలో ఎస్సీలు మజ్లిస్‌కు మద్దతిస్తారా? అన్న సవాళ్లు మజ్లిస్‌ను వేధిసూ్తనే ఉన్నాయి. అందుకే.. అసలు మజ్లిస్‌ కరీంనగర్‌లో పోటీ చేస్తుందా? లేక మిత్రపక్షం బీఆర్‌ఎస్‌తోనే కలిసి నడుస్తుందా? అన్న ప్రశ్నకు మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది.  

మరిన్ని వార్తలు