రాష్ట్రపతి ఎన్నికలపై పెరిగిన బీజేపీ పట్టు

11 Mar, 2022 04:19 IST|Sakshi

యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో విజయంతో కమలనాథులకి అడ్వాంటేజ్‌

ప్రధాని మోదీ చేతిలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టుని పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయఢంకా మోగించడంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగిసిపోతుంది.రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉంటారు.

ఒకవేళ యూపీ ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ విజయం సాధించి ఉంటే బీజేపీకి ఒడిశాలోని బీజేడీ, తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ మద్దతు అవసరమయ్యేది. కానీ యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ విజయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి అడ్వాంటేజ్‌గా మారిందని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ పి. శ్రీధరన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో లోక్‌సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 233 మందితో పాటుగా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4,120 మంది మొత్తంగా 4,896 మంది సభ్యులుగా ఉంటారు. ఎంపీల ఓటు విలువ 708గా ఉంటే,  ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాలను బట్టి మారిపోతుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువని నిర్ణయించారు.

ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208గా ఉంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన  ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేల మొత్తం  ఓట్ల విలువ 83,824, పంజాబ్‌లో 13,527, ఉత్తరాఖండ్‌లో 4,480, గోవాలో 800, మణిపూర్‌లో 1080గా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేరు ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చీలికలు తేవడానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పేరుని కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాలని కొందరు డిమాండ్‌ చేశారు. ఎలక్టోరల్‌ కాలేజీలో సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ 10,98,903లో 50శాతానికి పైగా ఓట్లు వస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలరు. జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో  ప్రధాని మోదీ ప్రతిపాదించిన అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు